కెనడాలో హిందూ సభ ఆలయం బయట హిందువులపై దాడిఘటనలో స్వయంగా పాల్గొన్న పోలీసు అధికారిని పీల్ పోలీసులు సస్పెండ్ చేశారు. బ్రాంప్టన్ లోని దేవాలయంలో హిందువులపై కర్రలతో దాడిచేసిన వాళ్లలో ఖలిస్తానీ అనుకూలుడైన సార్జెంట్ హరీందర్ సోహీ ఉన్నాడు.ఖలిస్తాన్ మద్దతుదారులు పెద్దఎత్తున గుమికూడి భారత వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ ఉన్న వీడియోలు, హిందువులపై దాడులకు తెగబడుతున్న వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో హరీందర్ సోహీని గుర్తించిన ఉన్నతాధికారులు కమ్యూనిటీ సేఫ్టీ అండ్ పోలీసింగ్ యాక్ట్ ప్రకారం అతన్ని సస్పెండ్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని… సోహీ సహా మరో ఇద్దరిపైనా చర్యలు తీసుకుంటున్నట్టు పీల్ పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు.
ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు వ్యతిరేకంగా కొన్నిరోజులుగా నిరసనలు, ఆందోళనలను ఉధృతం చేశారు ఖలిస్తాన్ మద్దతుదారులు. హిందూఆలయాలు, హిందువులను లక్ష్యంగా వరుసగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మిస్సిసాగాలోని వెస్ట్‌వుడ్ మాల్‌లో పెద్దఎత్తున నిరసనకు దిగారు.ఆ ఆందోళనలను తమ హక్కుగా వాల్డ్ సిక్కు ఆర్గనైజేషన్ ప్రకటించింది. అక్కడి ఎయిర్‌పోర్ట్ రోడ్‌లోని మాల్టన్ గురుద్వారా వెలుపల మరో నిరసన జరిగింది. తరువాత ప్రొ- ఖలిస్తాన్ గ్రూపులు వరుసగా ఆలయాలపై దాడులకు తెగబడ్డారు. సర్రేలోని హిందూ దేవాలయంలోకి కర్రలతో చొరబడిన తీవ్రవాదులు అక్కడున్న హిందువులపై దాడి చేశారు. ప్రొ ఖలిస్తాన్ గ్రూపుల నిరసనల్లో పోలీసులు పాల్గొంటుండడం ఉన్నతాధికారులను ఇబ్బందిపెడుతోంది.
ఈ ఏడాది మేలో అయితే ఖలిస్తానీల కోసం ఏకంగా రిక్రూట్మెంట్ క్యాంప్ లు ఏర్పాటు చేశారు కెనడా పోలీసులు. కనిష్క బాంబు పేలుళ్ల సూత్రధారి తల్వీందర్ సింగ్ పర్మార్ స్మృత్యర్థం ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఏర్పాటు చేసుకున్న ఈవెంట్లో కెనడియన్ సాయుధ దళాలు రిక్రూట్మెంట్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
అయితే ఇప్పుడు వీడియో బయటకు రావడం వల్ల నిరసనల్లో పోలీసులు పాల్గొన్నారని బయటి ప్రపంచానికి తెలిసింది తప్ప అక్కడివాళ్లకు ఇది కొత్త విషయమేం కాదు. కెనడా సాయుధ దళాల్లో పెద్దెత్తున ఖలిస్తానీ అనుకూల వ్యక్తులున్నారు. కెనడా పోలీసు ఏజెన్సీలు ఖలిస్తాన్ ఉగ్రవాద గ్రూపులతో కలిసి పనిచేస్తుండడంపై కొంతకాలంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తాజాగా పీల్ లో ఓ పోలీసు అధికారి స్వయంగా ఖలిస్తాన్ నిరసనకారుడిగా హిందువులపై దాడి చేస్తూ కెమెరాకు చిక్కాడు. వీడియోలో ‘ఎవరు తీవ్రవాది’ అని ఓ యువకుడు అడుగుతుంటే…”భారతప్రభుత్వమే” అని అక్కడున్న కొందరు అరిచారు. అందులో ఖలిస్తానీ జెండా పట్టుకుని హరీందర్ సైతం నినాదాలు చేస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా ఉంది. తాజా ఘటనతో ఖలిస్తాన్ అనుకూలవాదులు ఎంతమంది, ఎవరెవరు కెనడా దళాల్లో చేరారనే విషయంపై విచారణ చేస్తున్నారు.