దేశ వ్యతిరేకశక్తులు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాయని ఎన్నోసందర్భాల్లో రుజువైంది. అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ అండ్ కో కశ్మీర్ లోని వేర్పాటు వాదులకు, దేశంలోని ఇతర విద్రోహశక్తులకు మద్దతుగా నిలిచారు. అదే పార్టీకి చెందిన మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్ వంటి వారైతే తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని పలుమార్లు ప్రకటించారు. వేర్పాటువాదులు, కాంగ్రెస్ వాదులు వేరుకాదని మరోసారి నిరూపించేలా…జైల్లో ఉన్న తన భర్త గురించి పార్లమెంట్లో మాట్లాడాలని కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ భార్య ముషాల్ రాహుల్ గాంధీకి లేఖరాసింది. తన భర్తకు న్యాయం చేయాలని, ఆయనకు అవకాశం ఇస్తే జమ్మూకశ్మీర్లో శాంతి స్థాపనకు కృషి చేస్తాడనీ లేఖలో పేర్కొంది. తన భర్త కోస పార్లమెంట్లో చర్చ పెట్టాలనీ లేఖలో ఆమె విజ్ఞప్తి చేసింది. తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ ఏం జరక్కముందే జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీని ఆమె కోరింది.
కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమానికి నాయకత్వం వహించిన యాసిన్ మాలిక్ జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించాడు. జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ గా లోయలో వేర్పాటు వాదాన్ని పెంచి పోషించాడు. కశ్మీర్ లో హిందువుల మారణహోమంతో పాటు… నలుగు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల హత్యలో మాలిక్ ప్రమేయం ఉంది. 30 ఏళ్లనాటి రాజద్రోహం కేసులో అతనికి మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ డిమాండ్ చేస్తోంది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులోనూ మరణశిక్ష విధించాలని ఎన్‌ఐఏ దాఖలు చేసిన అప్పీల్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. అసలైతే టెర్రర్ ఫండింగ్ కేసులో తన నేరాన్ని యాసిన్ మాలిక్ అంగీకరించాడు. దీంతో 2022లో ట్రయల్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. అలాంటివ్యక్తిని జైలు నుంచి విముక్తి చేయాలని ముషాల్ అంటోంది. జమ్ముకశ్మీర్లో శాంతి నెలకొల్పడానికి యాసిన్ మాలిక్ శక్తిగా మారుతాడట. తనభర్త అహింసా వాదిగా మారాడంటున్న ముషాల్ అతనిలోని మార్పును గుర్తించాలని రాహుల్ ను వేడుకుంది. 2019నుంచి కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆయన్ను వేధిస్తోందని…35 ఏళ్లనాటి కేసులో ఇంకా ఆయన్ని విచారిస్తున్నారని… మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారనీ గుర్తు చేసింది. ఎన్ఐఏ మాలిక్ పై చేసినవన్నీ అసత్య ఆరోపణలేనని..ఇప్పుడు ఏకంగా ఉరిశిక్షవేయించాలని చూస్తున్నారనీ అంది.
తనభర్త లోయలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించాడని, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడనీ అమెకు తెలుసు. అయినా సరే తన భర్తను క్షమించాలంటోంది. ఎందుకంటే యూపీఏ హయాంలో మాలిక్ కు ఆస్థాయిలో ఆహ్వానాలందాయి, సత్కారాలు జరిగాయి. 1990లో ఆయుధాలతో భద్రతాబలగాలకు చిక్కిన యాసిన్ మాలిక్ 1994వరకు జైల్లోఉన్నాడు. తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు.
2006లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసానికి అతన్ని అహ్వానించారు. జమ్మూ కాశ్మీర్‌లోని రాజకీయ నేతలతో పాటు మాలిక్ ను తనింట్లో సమావేశానికి పిలిచి సకల మర్యాదలు చేశారు. మాలిక్ తో ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు మన్మోహన్ సహా, కాంగ్రెస్ ప్రముఖ నేతలు. అంతకుముందే 2001లో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడే ఒక జర్నలిస్ట్ ఇంట్లో మన్మోహన్ ను కలిశానని, 2003లో సోనియాగాంధీ ఇంటికి కూడా వెళ్లానని మాలిక్ చెప్పుకున్నాడు.
నాటి కశ్మీరీ హిందువుల ఊచకోతలో సూత్రధారి మాలిక్. అప్పుడే ఐఏఎఫ్ అధికారులనూ చంపారు. 1989 లో అప్పటి హోం మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయా సయీద్‌ను కిడ్నాప్ చేసినట్లు అంగీకరించాడు. ఆమెకూడా మాలిక్ ను గుర్తు పట్టింది. JKLF ఉగ్రవాది మక్బూల్ భట్‌కు మరణశిక్ష విధించిన తర్వాత శ్రీనగర్‌లో అదే ఏడాది జరిగిన హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నీలకంఠ గంజూ హత్యలోనూ మాలిక్ కు ప్రమేయం ఉందని తేలింది. అలాంటి వ్యక్తికి స్వేచ్ఛ ప్రసాదించాలని భార్య కోరుకుంటోంది. అందుకు ఆమెకు ఒక ఆశగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కనిపించడంలో ఆశ్చర్యంలేదు.
ముషాల్ పాకిస్తాన్ పౌరురాలు. యాసిన్ మాలిక్, ముషాల్ ల వివాహం 2009లో జరిగింది. వారికి ఓ కుమార్తె. ఆమె కొంతకాలం మానవహక్కులు, మహిళా సాధికారతపై పాకిస్తాన్ ప్రధానికి సహాయకురాలిగా పనిచేసింది.ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014లో ఆమె రెండుసార్లు భారత్ వచ్చింది. తరువాత తన వీసాను రెన్యువల్ చేసుకోలేదు. 2019లో మాలిక్ అరెస్ట్ నేపథ్యంలో అప్పుడు వీసాకు మళ్లీ దరఖాస్తు చేసుకుంది.