వక్ఫ్ సవరణ చట్టం మీద చర్చలు జరుగుతున్న వేళ బోర్డ్ అక్రమాలు, ఆక్రమణలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన, ధార్మిక ప్రయోజనాలకోసం ప్రత్యేకంగా దానంగా వచ్చిన ఆస్తుల వ్యవహారాలు చూసేదే వక్ఫ్ బోర్డ్. ప్రస్తుతం భారతదేశం అంతటా 9.4 లక్షల ఎకరాల భూమిలో రూ. 1.2 లక్షల కోట్ల విలువ గల 8.7 లక్షల ఆస్తులు వక్ఫ్ బోర్డుల అధీనంలో ఉన్నాయి. భారత దేశంలో డిఫెన్స్ మరియు రైల్వేల తర్వాత మూడవ అతిపెద్ద భూయజమానిగా ఉన్నది ఈ వక్ఫ్ బోర్డే అని మీకు తెలుసా…
ఇస్లామిక్ రాజ్యాల్లోనే ఇటువంటి మతపరమైన ఆస్తులు ప్రభుత్వాలు నియంత్రిస్తూ ఉంటే సెక్యూలర్ భారత్ లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాలు వక్ఫ్ చట్టాలు చేసి, వక్ఫ్ బోర్డు లకు విపరీతమైన అధికారాలు కట్టబెట్టాయి. దాంతో అవి తమ అపరిమితమైన అధికారాలతో దేశంలో ఆస్తులు పెంచుకోవడం మొదలుపెట్టాయి. నిజానికి, మొదట్లో WAQF భారతదేశంలో దాదాపు 52,000 ఆస్తులను కలిగి ఉంది. 2009 నాటికి, 4 లక్షల ఎకరాల్లో 300,000 రిజిస్టర్డ్ WAQF ఆస్తులు ఉన్నాయి.నేటికి సుమారు ఈ 8.7 లక్షల ఆస్తులు 9.40 లక్షల ఎకరాల్లో ఉన్నాయి.
మరి వక్ఫ్ ఆస్తులు ఎలా పెరిగాయి? ఎలా అంటే, WAQF బోర్డు ప్రైవేట్ ఆస్తులు మరియు ప్రభుత్వ ఆస్తులను తమవిగా క్లయిమ్ చేస్తోంది, వాటిపై వివిధ రెవెన్యూ శాఖలు మరియు సెక్యులర్ స్టేట్ ప్రభుత్వాలు WAQF క్లెయిమ్‌లను ఆమోదిస్తున్నాయి అంతే! అంతే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆస్తులు కూడా వక్ఫ్ పరం చేసేశారు/చేస్తున్నారు.
ఒకవైపు లక్షల ఎకరాల దేవాలయ భూములు కళ్లెదురుగా కబ్జాలకు గురై వేగంగా తరిగిపోతూ ఉంటే, మరో వైపు ఎప్పుడో వందల ఏళ్ల క్రితం తమకు ఎవరో ఓ ఆస్తిని దేవుడికి ఇచ్చారు అనే నెపంతో ఆ ఆస్తి పత్రాలతో సంబంధం లేకుండా ఆ ఆస్తులను ఇప్పుడు క్లయిమ్ చేస్తూ వక్ఫ్ బోర్డులు ఆస్తులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ పోతున్నాయి.
వక్ఫ్ కి ఉన్న ఈ అపరిమిత అధికారాలకు చెక్ పెట్టి కోర్టుల ద్వారా వివాదాల పరిష్కారం మొదలగు వంటి సంస్కరణలను తీసుకురావడానికి ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే, దీని మీద ప్రతిపక్షాలు గొడవ చేయడంతో దీనిపై చర్చించడానికి పార్లమెంటు సంయుక్త కమిటీ(JPC) వేశారు. ఈ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే, గతంలో లాగా ఆస్తులు సులువుగా వక్ఫ్ బోర్డులకు బదలాయించడం కుదరదు అనే భయంతోనో ఏమో ఈ మధ్య పలు రాష్ట్రాల్లో ఈ వక్ఫ్ బోర్డ్ లు కొన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున క్లయిమ్ చేయడం మొదలు పెట్టాయి.
ఈ మధ్య సెప్టెంబరు/అక్టోబర్ నెలల్లో వచ్చిన అటువంటి దావాలు :
- మహారాష్ట్రలో అహమ్మద్ నగర్ జిల్లాలో
కనీఫ్ నాధ్ దేవాలయానికి చెందిన 40 ఎకరాల భూమి. - ఢిల్లీ లో 6 హిందూ దేవాలయాలు
- కర్ణాటక విజయపురలోని రైతులకు చెందిన 1200 ఎకరాల భూములు.
- ఇదే కర్ణాటక విజయపుర లో అదిల్ షాహీ కాలానికి చెందిన పురావస్తు శాఖ అధీనంలో ఉన్న 53 ప్రాచీన ఆస్తులను వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసి 2005లోనే వీటిల్లో 43 ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారు. కనీసం పురావస్తు శాఖకు కూడా తెలియకుండా, అప్పట్లో హెల్త్ సెక్రటరీ గా మరియు వక్ఫ్ బోర్డ్ డిప్యూటీ కమిషనర్ మరియు ఛైర్మన్ గా చేసిన మహమ్మద్ మెషిన్ వీటిని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించేశారు. ఇవి కాక హంపీ ప్రాంతంలో మరొక 6 ఆస్తులు, బెంగుళూరు ప్రాంతంలో
మరో 4 ఆస్తులను ఇప్పుడు వక్ఫ్ దావా చేస్తోంది. - గత వారం కర్నాటక హవేరి జిల్లాలో కదాకోల్ అనే గ్రామంలో ఒక హనుమంతుని దేవాలయం మరియు దుర్గ దేవాలయం తో బాటు పలు ప్రైవేట్ ఆస్తులు(ఇళ్లు వగైరా) ను వక్ఫ్ క్లయిమ్ చేసింది అని తెలిసిన గ్రామస్తులు ఒక వర్గం పై దాడి చేసి హింసకు పాల్పడితే పోలీసులు రావలసి వచ్చింది.
- గత వారంలోనే ఇదే కర్ణాటక హవేరి జిల్లాలో 20 ఎకరాల్లో ఉన్న జిల్లా కోర్టు ను, 19 ఎకరాల్లో ఉన్న హిందూ స్మశాన వాటికను కూడా వక్ఫ్ బోర్డ్ క్లయిమ్ చేసింది.
- ఢిల్లీ లో ప్రభుత్వ రవాణా శాఖకు మరియు రైల్వే కి చెందిన 200 ఆస్తులను సెప్టెంబర్ మొదటి వారంలో వక్ఫ్ బోర్డ్ క్లయిమ్ చేసింది.
- హైదరాబాద్ లో మల్కాజిగిరి లో గల 750ఎకరాల భూమి మాదే అని వక్ఫ్ బోర్డ్ బాంబ్ పేల్చడంతో ఆ ప్రాంతంలో ఆస్తులు ఉన్న వాళ్లు టెన్షన్ పడుతున్నారు.
పై క్లయిమ్ లు అన్ని చూస్తే ఎక్కువగా కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డ్ దావాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ తమకు అనుకూల ప్రభుత్వం ఉంది అని భరోసా ఏమో? ఇప్పుడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండి, సోషల్ మీడియా వచ్చిన తరువాతే ఇంత విచ్చలవిడిగా ఆస్తులు క్లయిమ్ చేస్తున్నారు అంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వక్ఫ్ కి ప్రభుత్వ ఆస్తులు ఎన్ని దోచి పెట్టి ఉంటాయో ఊహించండి. కర్ణాటక లో ఈ గోడవ ముదిరి రైతులు, గ్రామస్తులు భారీ నిరసనలు తెలపడంతో రాజకీయంగా నష్టం కలుగుతుంది అని భయపడ్డ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వక్ఫ్ కి సంబంధించి రైతులకు ఇచ్చిన అన్ని నోటీసులు ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించారు.