ఇంకొన్ని గంటల్లో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుందనగా మాజీ ఎంపీ, బీజేపీ నేత నవనీత్ కౌర్ రాణాపై దాడి జరిగింది. అమరావతి దరియాపూర్ సమీపంలోని ఖల్లార్ లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా పలువురు ఆమెపై దాడికి దిగారు. అక్కడి అభ్యర్థి తరపున ప్రచారానికి వచ్చిన ఆమె ప్రసంగిస్తుండగా పలువురు వ్యక్తులు అడ్డుతగిలారు. వారిని పట్టించుకోకుండా ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు. మాట్లాడ్డం అయిపోయి వేదికనుంచి కిందకు దిగుతున్న ఆమెపై అక్కడున్న కొందరు దాడి చేశారు. ఆమెపైకి కుర్చీలు విసురుతూ బీభత్సం సృష్టించారు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షపడేలా చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నవనీత్ పై దాడి నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనే నాయకులు, అభ్యర్థుల భద్రతపై మరింత దృష్టిపెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక వీడియో ఆధారంగా పోలీసులను నిందుతులను గుర్తించే పనిలో పడ్డారు.
288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఈనెల 20న ఒకేవిడతలో ఎన్నిక జరగనుంది. 23 న ఫలితాలు వెలువడనున్నాయి. మహా వికాస్ అఘాడీ, మహాయుతి కూటమిలు మహాలో అధికారం కోసం తలపడుతున్నాయి.