తులసి లేని ఇళ్లు, దేవుడు లేని గుళ్లు ఉండవు . భారతీయులందరి లోగిలిలోనూ దర్శనమిచ్చేది తులసి. తులసిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. అయితే తులసి సంపద ప్రదాయిని మాత్రమే కాక…ఆరోగ్యప్రదాయిని కూడా. మలేరియా వంటి జ్వరాలను తగ్గించడంలో, కీళ్లనొప్పులు తగ్గించడంలో ఔషధంగా తులసిని వాడుతారు. తులసి గింజలను పెరుగు లేదా తేనెతో కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. ఉబ్బస వ్యాధికి తులసి మంచి మందు. కృష్ణతులసి ఆకురసం, నల్లమిరియాల పొడిని కలిపి తాగితే ఫలితం ఉంటుంది. ఇక చర్మవ్యాధులకూ మంచి ఔషధం.తులసిరసం, నిమ్మరసం కలిపి రాస్తే చాలు చర్మవ్యాధులు తగ్గిపోతాయి.కొన్ని నీళ్లల్లో తులసి ఆకులువేసిమరిగించి గోరువెచ్చగా చేసుకుని తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. తులసి ఆకులను గోరువెచ్చనినీటిలో వేసి తాగితే చెవినొప్పికూడా తగ్గుతుంది. తులసి ఆకు రసం కఫాన్ని, నీరసాన్నీ తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుందని, కొలెస్ట్రాల్ నూ తగ్గిస్తుందని ఆధునిక పరిశోధనల్లోనూ తేలింది. Cox-2 Inhibitor గా కేన్సర్ రోగులకు నొప్పి నివారిణిగా తులసిని వాడుతున్నారు. ఆవును సకల దేవతాస్వరూపంగా భావించే హిందువులు… సర్వతీర్థాలు, సర్వదేవతలు తులసి మొక్కల్లో ఉన్నాయని విశ్వసిస్తారు. మరణం అంచున ఉన్నవారికి సద్గతులు కలగాలని తులసీతీర్థం తాగిస్తారు.