వాయనాడ్ నుంచి ప్రియాంక వాద్రా ఘన విజయం-భారీ మెజార్టీ కట్టబెట్టిన ఓటర్లు
వాయనాడ్ నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా భారీ మెజారిటీతో గెలిచారు. నాలుగు లక్షల పైగా ఓట్ల మెజారిటీతో రికార్డ్ విజయం సొంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. కొన్నేళ్లుగా పార్టీ పదవుల్లో ఉన్న ప్రియాంక మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఏడాది మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయబరేలి, వాయనాడ్ నుంచి పోటీ చేసి రెండుచోట్లా గెలిచారు. ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో వాయనాడ్ లో ఉపఎన్నికల అనివార్యమైంది. ముందునుంచీ పట్టున్న వాయనాడ్ లో ప్రియాంక గాంధీని నిలపాలని పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అంచనాలకు అనుగుణంగానే వాయనాడ్ ఓటర్లు ప్రియాంకను భారీ మెజారిటీతో గెలిపించారు.
ఈ ఎన్నికల్లో ప్రియాంక సరికొత్త రికార్డును నమోదు చేశారని చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడినుంచి 3 లక్షల 65 వేల ఓట్ల మెజారిటీతో గెలవగా…ఆ రికార్డును అధిగమిస్తూ 4 లక్షల పైగా ఓట్లు సాధించింది. బీజేపీ ఇక్కనుంచి నవ్య హరిదాస్ ను పోటీలో దింపగా ఆమె మూడోస్థానానికి పరిమితం అయింది. కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి సత్యన్ మోకరి రెండోస్థానంలో నిలిచారు.