దేశంలో ఇస్కాన్ పై నిషేధం విధించేందుకు బంగ్లాదేశ్ హైకోర్ట్ నిరాకరించింది. ఇస్కాన్ స్వామి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, అనంతర హింస నేపథ్యంలో దేశంలో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలంటూ పలువురు ఢాకా కోర్టును ఆశ్రయించారు.అయితే పిటిషనర్ల వాదనను కోర్టు తోసిపుచ్చింది. అయితే తాజా ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలుతీసుకుందో చెప్పాలంటూ అటార్నీ జనరల్ కు ఆదేశాలు జారీ చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ ను జైలుకు తరలిస్తుండగా చెలరేగిన అల్లర్లలో న్యాయవాది సైఫుల్ ఇస్లా అలీఫ్ చనిపోయాడు. దీంతో ఇస్కాన్ ను నిషేధించాలంటూ మోనిరుద్దీన్ అనేలాయర్ ఢాకా హైకోర్టుకు వెళ్లాడు.
చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, అనంతర అల్లర్ల అంశంలో ప్రభుత్వం చర్యలు తీసుకుందని అటార్నీ జనరల్ జస్టిస్ ఫర్హా మహబూబ్, జస్టిస్ దెబాసిస్ రాయ్ కోర్టుకు తెలిపారు. సైఫుల్ ఇస్లాం అలీఫ్ హత్య కేసులో, ఇస్కాన్ కార్యకలాపాలపై వేర్వేరు కేసులను నమోదు చేశామన్నారు.
అటు బంగ్లాదేశ్ లో మైనార్టీలపై దాడులను అమెరికాలోని హిందూసంఘాలు ఖండించాయి. ఆ దేశంపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశాయి. ఆదేశంలో అమెరికా నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులు ఆపేయాలని హిందూస్ ఫర్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు లేఖరాసింది. బంగ్లాదేశ్ లోని హిందువుల రక్షణకు చర్యలు తీసుకునేలా ఆదేశంపై ఒత్తిడి తేవాలని కోరింది.
అక్కడి హిందువులపై దాడులు లెఫ్ట్ మేధావులకు కనిపించడం లేదని, మీడియాసైతం పట్టించుకోవడం లేదని హిందూసంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. కృష్ణదాస్ అరెస్ట్ తరువాత హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులుపెరిగాయని అమెరికాలోని హిందువులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.
అటు బంగ్లాదేశ్ లో అల్లర్ల నేపథ్యంలో భారతవిదేశాంగ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అక్కడి తాజా పరిస్థితులను వివరించారు.