వక్ఫ్ బోర్డుకు నిధులు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వును ఉపసంహరించుకుంది మహారాష్ట్రలోని తాత్కాలిక సర్కారు. పాలనాయంత్రాంగం తప్పిదాల్లో భాగంగా ఆ ఉత్తర్వులు జారీ అయినట్టు పేర్కొంది. వక్ఫ్ కు నిధుల కేటాయింపులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డుకు రూ. 10 కోట్లు కేటాయించిన 24 గంటల్లోనే దాన్ని రద్దు చేసింది. ఆపద్ధర్మప్రభుత్వానికి ఆ మొత్తాన్ని విడుదల చేసే అధికారం లేదని…సరైన పరిశీలన లేకుండా, ఆనాలోచితంగా జరిగిన పని అదని..అందుకే ఆ నిర్ణయాన్ని గంటల్లోనే ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుజితా సౌనిక్ స్పష్టం చేశారు.
రాష్ట్ర బడ్జెట్ నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ. 20 కోట్లను వక్ఫ్ బోర్డుకు మంజూరు చేసింది. మైనారిటీ అభివృద్ధి శాఖనుంచి జూన్ 10న 2 కోట్లు విడుదల కాగా…అదనంగా సత్వరమే మరో 10 కోట్లు కావాలని శాఖకు విజ్ఞప్తి లేఖలు వచ్చాయి. వాటి ఆధారంగా గురువారం మరో 10 కోట్లువిడుదల చేశారు.
అసలైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు ముందే ఆ మొత్తాన్ని విడుదల చేయాల్సి ఉంది. ఇప్పుడు కోడ్ లేకపోయినా ఇంకా ఆపద్ధర్మప్రభుత్వమే ఉంది. ఎలాంటి కేటాయింపులు ఇప్పుడు జరగడానికి వీల్లేదు. ఈ నియమ నిబంధనలపై అధికారులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువుదీరిన తరువాతనే కేటాయింపులు జరుగుతాయని స్పష్టం చేశారు.
తాజాఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. అయితే ఇంకా కొత్త సర్కారు కొలువుతీరలేదు. అయినా వక్ఫ్ బోర్డుకు నిధులు మంజూరయ్యాయి.సర్కారు తీరును నిరసిస్తూ హిందూసంఘాలు మండిపడ్డాయి. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. మైనారిటీ ఓట్ల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనీ విమర్శించింది.అసలిలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం తాత్కాలిక ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీసింది.
ఇక విశ్వహిందూ పరిషత్ సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే వచ్చేఎన్నికల్లో హిందూసమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడం ఖాయమనిహెచ్చరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేని పనిని మహాయుతి కూటమి సర్కారు చేయడం ఆశ్చర్యంగా ఉందనీ వ్యాఖ్యానించింది. ఇలా అన్ని వర్గాలనుంచి విమర్శలు వ్యక్తమవడంతో 10 కోట్ల రూపాయల కేటాయింపుపై జారీ చేసిన ఉత్తర్వును ప్రభుత్వం వెనక్కితీసుకుంది.