‘దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా పెరుగుతోంది. దానివల్ల అభివృద్ధి మందగిస్తుంది.. అందుకని జంటలు ఇకపై ఎక్కువమంది పిల్లలను కనాలి.’ ఇదీ కొద్ది రోజులక్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నమాట. అందుకోసం ప్రభుత్వం నుంచి ‘జనాభా నిర్వహణ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
అంతేకాక ఎక్కువమంది పిల్లలున్న వారికి స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామనీ అన్నారు. గతంలో ఉన్న ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులనే నిబంధలను రద్దు చేశామనీ చెప్పారు.
ఆశ్చర్యంగా ఇదే విషయంచెప్పారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఒక తమిళ్ సామెతను ప్రస్తావిస్తూ…’పదినారుమ్ పేట్రు పెరు వఝవు వఝాగ’ అని పిలుపునిచ్చారు. అంటే ‘పదహారు పొందు జీవితాన్ని గొప్పగా గడుపు’ అనీ.
ఇప్పుడు తాజాగా ఇదే పిలుపునిచ్చారు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్. నాగ్పూర్లో ఓ సభలో మాట్లాడుతూ దంపతులు కనీసం ముగ్గురు పిల్లలను కనాల్సిన అవసరం ఉందని అన్నారు. మొత్తం సంతానసాఫల్య వృద్ధిరేటు (TFR) 2.1 కంటే తక్కువ ఉందని..అందుకని జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ‘సంతానోత్పత్తి వృద్ధిశాతం 2.1 కంటే తక్కువగా ఉంటే, ఆ సమాజం భూమి నుండి అదృశ్యమవుతుంది. సమాజంలో కుటుంబం ఓ భాగం. ప్రతి కుటుంబం ఓ యూనిట్. అయితే జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విలువలు, భాషలు, అలవాట్లు వారసత్వంగా ఒక తరం నుంచి మరొక తరానికి అందుతాయి. జనాభా ఉత్పత్తిలో సమతుల్యత సాధించడం ద్వారా కేవలం భారతీయులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా శాశ్వతమైన ప్రధాన వ్యవస్థలు, వర్గాలు వాటి విలువలు సంరక్షించుకోవచ్చు. వృద్ధిరేటు 2.1 కన్నా తక్కువకు పడిపోతే సమాజం అంతరించిపోతుంది.అప్పుడు దానినెవరూ నాశనం చేయాల్సిన అవసరం లేదు.. తనంత తానే నాశనమవుతుంది. భాషలు, సంస్కృతి, విలువలు అన్నీ నాశనం అవుతాయి.’ అని భాగవత్ హెచ్చరించారు.
జనాభా పెరుగుదలలో అసమతుల్యం వల్ల…గతంలో అనేక భాషలు,సంస్కృతులు, సమాజాలు నాశనం అయ్యాయని ఆయన ఉదహరించారు కూడా. అందువల్ల ప్రస్తుత సమాజంలోని జంటలు ముగ్గురి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని, అదే జనాభాశాస్త్రంకూడా చెబుతోందని వివరించారు. అదే సందర్భంలో మరో ముఖ్య విషయాన్నీ చెప్పారు ఆర్ఎస్ఎఎస్ చీఫ్. జనాభా నిర్వహణ ఒక్కటే కాకుండా దేశంలో కుటుంబ వ్యవస్థ పరంపర కొనసాగించడం వల్ల మన సమాజ సంస్కృతి సంప్రదాయాలు,విలువలు ముందు తరాలకు అందుతాయని ఆయన పిలుపునిచ్చారు.
జనాభాలో వృద్ధ జనాభా నిష్పత్తి పెరగడం వల్ల వచ్చే ఇబ్బందులను ఇప్పటికే చైనా, జపాన్ సహా కొన్ని యూరోపియన్ దేశాలు ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో ఇటువంటి సమస్య 2047 వరకు రాకపోవచ్చు కానీ ఇప్పటినుంచే అప్రమత్తం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్.