దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్న అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ…, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు పన్నుల్లో వాటాపై సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడం లాంటి పరిణామాల మధ్య ఈ డిమాండ్ చర్చనీయాంశమైంది.
వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఈ డిమాండ్ తో ఎక్స్ లో ట్వీట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏటా రెండు సార్లు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని, కాలుష్యం కారణంగా శీతాకాల సమావేశాలు ఢిల్లీలో కంటే దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వహించటం కరక్టని ఆయన అంటున్నారు. అసలైతే ఈ డిమాండ్ కొత్తదేం కాదు. 66 ఏళ్ల క్రితం ప్రకాశ్ వీర్ శాస్త్రీ అనే ఎంపీ లోక్ సభలో దీనిపై చర్చకు నోటీసు ఇచ్చారు.ప్రతీ సంవత్సరం దేశరాజధానితో పాటు… బెంగళూరు లేదా హైదరాబాద్ లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ సమైక్యతకు దోహదం చేస్తుందని ఆయనఅభిప్రాయపడ్డారు. 1968లో ఆయన ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టగా….. అప్పటి ప్రభుత్వం 18 మంది ఎంపీలతో అధ్యయనానికి కమిటీని సైతంవేసింది. అప్పటి కేరళ, మైసూర్ రాష్ట్రాలు భూమి ఇవ్వటానికి ముందుకు వచ్చాయి. సమావేశాల్ని సరళతరంగా మార్చేందుకు వీలుగా క్వశ్చన్ అవర్ లేకుండా నిర్వహించాలని ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఇలాంటి సమావేశాల వల్ల ఏ ప్రయోజనం ఉండదని, ప్రతిపక్షాలు అసంతృప్తితో ఉంటాయని ప్రభుత్వం భావించింది. మధ్యప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఢిల్లిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో సమావేశాలు పెట్టడానికి తాము వ్యతిరేకమని చెప్పాయి. దీంతో ప్రభుత్వం దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు సాధ్యం కావని ఆ ప్రతిపాదనని రిజెక్ట్ చేసింది. బీజేపీ అగ్రనేత వాజ్ పేయి సైతం దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సమావేశాల డిమాండ్ తోసిపుచ్చేదేం కాదని దానిపైన చర్చ జరగాలని కోరుకున్నారు.
తరువాత అడపాదడపా ఈ అంశం చర్చకు వచ్చినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరటం, అక్కడవాతావరణ అననుకూలపరిస్థితులతో డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీపై ఒత్తిడి తగ్గించటానికి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు దక్షిణాదిలో నిర్వహంచటం మంచి నిర్ణయం అవుతుందని చాలామంది అంటున్నమాట.అయితే దక్షిణాదిలో సమావేశాలు అనగానే అందరిచూపు హైదరాబాద్ వైపే ఉంటోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంగానే కాక ఎన్నోప్రత్యేకతలు భాగ్యనగరానికిఉన్నాయి. ముఖ్యంగా వాతావరణంపూర్తి సమతుల్యంగా ఉంటుంది. కాలానికి అనుగుణమైన వాతావరణం ఉంటుంది. వరదల ప్రభావం, భూకంపాలవంటి విపత్తుల ప్రమాదాలు ఉండవు. హైదరాబాద్ కు అలవాటుపడిన వారు ఈనగరాన్ని వీడడానికి అస్సలు ఇష్టపడరు. అందుబాటులో కావల్సినంత స్థలం, నగరం మధ్యలో అంతర్జాతీయవిమానాశ్రయం, ఎక్కడిక్కడ మెట్రో నెట్ వర్క్ఇంకేం కావాలి. అసలైతే రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారు. ప్రాంతల మధ్య సమానత్వం, జాతీయ సమైక్యతకు దేశానికి రెండో రాజధాని అవసరమని, అది హైదరాబాద్ అయితే ఇంకా బాగుంటుందని థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకంలోరాశారు కూడా.
ఇక భారత రాష్ట్రపతి ఏటా వేసవి,శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రావడంఆనవాయితీ అయింది కూడా.
ఇక ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం బెంగళూరుతో పాటు బెళగావిలో, మహారాష్ట్ర ముంబాయి తో పాటు నాగ్ పూర్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాతోపాటు, ధర్మశాలలో, ఉత్తరాఖండ్ డెహ్రడూన్ తో పాటు గైర్ సైనీలోనూ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇక జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ సమావేశాలు జమ్మూలోనూ, శ్రీనగర్లోనూ జరుగుతున్నాయి. ఇలా రాష్ట్రాలు అసెంబ్లీ సమావేశాలు రెండు నగరాల్లో నిర్వహిస్తుండగా పార్లమెంట్ సమావేశాలు మాత్రం ఎందుకు నిర్వహించకూడదన్నది ఈ డిమాండ్ లేవనెత్తిన వారి ప్రశ్న. అయితే అది అంత సులువు కాదని… సిబ్బంది, ఫైల్స్, సమాచారాన్ని తరలించడం పెద్ద ప్రహసనమని మరికొందరు అంటున్నారు. అయితే ఈ డిజిటల్ యుగంలో ఈ ఆఫీస్ ని విస్తృతంగా వాడుతున్న తరుణంలో, సమాచార, రవాణా వ్యవస్థ ఇంత అందుబాటులో ఉన్న ఈరోజుల్లో అదిసమస్యే కాదన్నది మరికొందరి వాదన. కనీసం ఢిల్లీలో పూర్తిగా ప్రతికూల వాతావరణంఉండే శీతాకాలంలోనైనా సమావేశాలు దక్షిణాదిలో నిర్వహిస్తే బాగుండనేది మరికొందరి మాట. ఇక దక్షిణాఫ్రికా, మలేషియా, సౌత్ కొరియాల లాంటి దేశాలు ప్రత్యేకత పరిస్థితుల్లో కొన్నిసార్లు రెండు చోట్ల సమావేశాలు నిర్వహిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.
ఇక సాంకేతికంగా సాధ్యాసాధ్యాలు అటుంచితే దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలునిర్వహిస్తే మంచిదని సామాన్యులు సైతం అభిప్రాయపడుతున్నారు. నార్త్, సౌత్ అనే బేధాల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందంటున్నారు. నిజమే కదా దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాల నిర్వహణ మొదలుపెడితే రాజకీయ శక్తి మొత్తం ఢిల్లీలోనే కేంద్రీకృతమవుతోందన్న భయాందోళనలు ఇక్కడివాళ్లలో తగ్గుతాయి. స్థలాభావంతో ఇబ్బందిపడుతున్న ఢీల్లీపై కొంత ఒత్తిడి తగ్గుతుంది. దేశంలోని మిగతా ఎంపీలు దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, భాషని తెలుసుకోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది. నార్త్ సౌత్ బేధాల్ని తీసుకువచ్చి దేశాన్ని విభజించాలని జనాన్ని రెచ్చగొడుతున్న అరాచక శక్తుల అల్లరికీ అడ్డుకట్ట వేయవచ్చుకదా. హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై మహానగరాలనూ అందుకు పరిశీలించవచ్చు.