రోశయ్యగారిలాగా తెలంగాణ అసెంబ్లీలో వ్యూహాత్మకంగా వ్యవహరించే నాయకుడు లేడు.నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వాళ్లు ప్రశాంతంగా పాలన సాగించారంటే రోశయ్య వల్లే. వాళ్లు సీఎంలుగా అధికారాన్ని చెలాయిస్తూ ఉంటే…సమస్యల్నిపరిష్కరించే కుడి భుజంగా ఆయన ఉన్నారు. రోశయ్య లాంటి సహచరుడు ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణిస్తారు. అలాంటివారు లేని లోటు కనిపిస్తోంది. ఎవరున్నా ఆయన నెంబర్ టూ గా ఉండేవారు.. నెంబర్ వన్ పొజిషన్ కు రావాలని ఎప్పుడూ అనుకోలేదు, ఎవరినీ జరపలేదు… ఆయన నిబద్ధతను గుర్తించే అధిష్టానం ఆయన్ని సీఎంగా నియమించింది. ఆ తరువాత గవర్నర్ నూ చేసింది.
ఇదీ రోశయ్య వర్దంతి సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నమాటలు.
రేవంత్ ఈ మాటలు అన్నది రోశయ్య వర్దంతి సభలో. ఒక సీనియర్ లీడర్ గా ఆయన గొప్పతనం గురించి తలుచుకోవడం వరకు సరే. కానీ రేవంత్ ఈ మాటల్లో ఆంతర్యం వేరే ఉందనే చర్చైతే రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
నిజంగానే రోశయ్య ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. సంపూర్ణరాజకీయ జీవితం ఆయనది. పాలనలో తన అనుభవాన్ని రంగరించి శాసనసభలో ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఎలాంటి విమర్శలు వచ్చినా తిప్పికొట్టేవారు. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఇరుకున పెట్టేవారు. మాటలతోనే మంత్రం వేసేవారు. సీనియర్ మంత్రిగా ముఖ్యంగా వైఎస్ హయాంలో అయితే ఆర్థికమంత్రిగా నెంబర్ టుగా ఉన్నారు. వైఎస్సార్ సైతం ఆయనకు సముచిత గౌరవన్నిచ్చారు. ఇక రేవంత్…బయట పార్టీ నుంచి వచ్చిన ఆయనకు మొదట్లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఏమాత్రం సహకరించలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన పీసీసీ పగ్గాలు అందుకున్నారు. చివరికి కేసీఆర్ లాంటి వ్యక్తిని ఎదుర్కొని కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో ఆయన పాత్ర ఎవరూ కాదనలేనిది. పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు సీనియర్లు ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. హైకమాండ్ సపోర్టుతో ఆయన సీఎం కాగలిగారు. సీఎం అయ్యాక కూడా కొందరు ఎడమొకం, పెడమొకంగానే ఉన్నారు.
ఆయన రాకను ముందు నుంచీ వ్యతిరేకించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి వంటి వారితో విభేదాలు సద్దుమణిగాయని పార్టీ వర్గాలు ఎప్పటికప్పుడు చెప్పుతూ వచ్చాయి. ఎవరు ఎన్ని మాటలు అన్నా…విమర్శలు చేసినా, మీడియాకు ఎక్కినా సరే రేవంత్ తనపని చేసుకుపోయారు తప్ప విమర్శలకు సమాధానం ఇవ్వలేదు, అసలుపట్టించుకోలేదు. అయితే పార్టీలో కొందరి వల్ల నిజంగానే రేవంత్ ఇబ్బంది పడుతున్నారా…ఆయనకు పూర్తి సహకారం అందడం లేదా. ఆ అసంతృప్తినే ఆయన ఇలా వెల్లగక్కారా…రోశయ్య లాంటి సహచరుడు ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణిస్తారు. ఆ లోటు స్పష్టంగా తెలుస్తోంది అన్నఆయన మాటల్నిఇంకెలా తీసుకోవాలి..
రేవంత్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా నెంబర్ టూ గా భట్టి విక్రమార్క ఉన్నారు. శ్రీధర్ బాబు, కొమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు కూడా పార్టీలోనూ, రాజకీయంగానూ ఆయనకన్నా సీనియర్లు. ఎంత సీఎం అయినా, హైకమాండ్ అండదండలు ఎంత ఉన్నా… ఇక్కడ సహచరుల సహకారం లేకుంటే పాలన కత్తిమీద సామెయ
విద్యుత్ కేంద్రాల నిర్మాణం, రోడ్లు, శాసన సభా వ్యవహారులు, ఇరిగేషన్ లాంటి శాఖల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ముఖ్యమంత్రికి సహచర మంత్రుల నుంచి సరైన సహకారం అందట్లేదనే ప్రచారం జరిగింది అప్పట్లో. దీని వల్ల కొన్ని నిర్ణయాల్లో జాప్యం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్ని హైకమాండ్ కు వివరించే ప్రయత్నం రేవంత్ చేసినా హైకమాండ్ పట్టించుకోలేదనీ అంటున్నారు. ఇన్ని సమస్యల మధ్య ముఖ్యమంత్రి సమర్థంగా పనిచేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ నియామకాలు, పెట్టుబడులు, హైదరాబాద్ అభివృద్ధిపై ఆయన ఎంత మాత్రం తగ్గట్లేదు. కీలకమైన అధికారు బదీలీల్లోనూ మంత్రలు తాము పట్టిందే జరగాలని కూర్చుంటున్నారట. అయినా కూడా ఎక్కడా పాలనలో ఇబ్బందులు రాకుండా… విబేధాలు బయటకు రాకుండా రేవంత్ వ్యవహరిస్తున్నారు. నిన్ననే పెద్దపల్లిలోనే మరో సభలో ఆయన శ్రీధర్ బాబు గురించి లైటర్ టోన్ లో… ఆయన పనుల కోసం బెదిరిస్తున్నారనీ రేవంత్ అన్నారు. ఇతర మంత్రులు కూడా తమ నియోజకవర్గాలకు, జిల్లాలకు అధిక నిధులు కేటాయించాలని పట్టుపడుతున్నారు. అయినా కూడా ముఖ్యమంత్రి బ్యాలెన్స్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన జిల్లాల్ని ఆయన అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. హైడ్రా విషయం మీద కేబినెట్ సహచరులు గుర్రుగా ఉన్నప్పటికి ఆయన మాత్రం ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వ్యవహరించటం వారికి మింగుడుపడటం లేదట. కొన్నిసార్లు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని సైతం ముఖ్యమంత్రి ఒక్కరే సమర్థంగా తిప్పికొడుతున్నట్టు కనిపిస్తోంది. మంత్రులు తమ శాఖల వరకే పరిమితమై… పార్టీపై విమర్శల్ని పట్టించుకోవట్లేదు. స్వయంగా ముఖ్యమంత్రే రోజు వారీగా ప్రతిపక్షాల విమర్శల్ని ఎదుర్కోవటం కేవలం తెలంగాణలో మాత్రమే చూడగలుగుతున్నామని ఆపార్టీ వాళ్లే అంటున్నమాట. ముఖ్యమంత్రుల్ని తరుచుగా మార్చే సాంప్రదాయం ఉన్న కాంగ్రెస్ లో తనదైన శైలితో వెళుతున్నారు రేవంత్. కాంగ్రెస్ చరిత్రలో కేవలం రాజశేఖర్ రెడ్డి, కాసు బ్రహ్మనంద రెడ్డిని తప్పా ఏ ముఖ్యమంత్రిని పూర్తి కాలం పని చేయనివ్వలేదిక్కడ. అయితే రేవంత్ కూడా పూర్తికాలం కొనసాగుతారని… వయసు, అనుభవం లేకపోవచ్చని…కానీ ఆయన వ్యూహాలు ఆయనకున్నాయని…ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఈ స్థాయికి చేరుకున్నఆయన స్థాయి ఇక పదిలం అని అనుచరులు నమ్మకంగా చెబుతున్నమాట.