ఏడాది పాలన పూర్తైన సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ప్రాంగణంలో ఆవిష్కరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దిద్దిన తెలంగాణ తల్లి రూపురేఖల్ని పూర్తిగా మార్చేసింది. సోనియా జన్మదినం సందర్భంగా ఈనెల 9న విగ్రహావిష్కరణ చేయనున్నారు. అయితే ఆవిష్కరణకు ముందే విగ్రహం చుట్టూ విమర్శలు మొదలయ్యాయి. అసలైతే ఉద్యమ సమయంలోనే కేసీఆర్ ఆవిగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉద్యమకాలంలోనూ, రాష్ట్ర ఆవిర్భావం తరువాత అవే విగ్రహాలను ఊరూవాడా పెట్టుకున్నారు ప్రజలు. అయితే ఆ విగ్రహం దొరసానిలా ఉందని, తెలంగాణ ఆత్మ అందులో లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వచ్చింది.తాము అధికారంలోకి వచ్చాక కొత్త విగ్రహం పెడతామని రేవంత్ ఎన్నడో చెప్పారు. చెప్పినట్టుగానే నేతచీర,ఆకుపచ్చ మట్టిగాజులు, మెడలో కంటె, నుదుట బొట్టుతో కొత్త విగ్రహం రూపుదిద్దుకుంది. ఇక విగ్రహం అడుగున తెలంగాణ ఉద్యమ సూచిగా బిగించిన పిడికిళ్లు ఉంచారు. ఒక చేతిలో మక్క, జొన్న,సజ్జ కంకులు ఉంచారు. కాళ్లకి మెట్టెలు, బంగారు అంచు ఆకుపచ్చ చీరతో తెలంగాణ తల్లి మూర్తిని రూపొందించారు.
అయితే ఈ కొత్త విగ్రహం విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. ఇరువర్గాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఉద్యమ ఆనవాళ్లను, కేసీఆర్ కృషిని చెరిపేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ అంటోంది. దైవత్వం ఉట్టిపడేలా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. మరికొందరు అసలు తెలంగాణ అస్తిత్వమే ఈ విగ్రహంలో కనిపంచడం లేదని మరికొందరు పెదవి విరుస్తున్నారు. అసలు తెలంగాణ అంటేనే బతుకమ్మ అని ఆ బతుకమ్మే లేకుండా చేశారని మండిపడుతున్నారు. ఇక బతుకమ్మ ఉండాల్సిన చేతిని ఖాళీగా ఉంచారు. అభయహస్తాన్ని పెట్టడం కాంగ్రెస్ పార్టీ గుర్తును ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
అయితే బతుకమ్మ విషయంలోనే ఎక్కువమంది ప్రశ్నిస్తున్నారు. అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ముందుండి బతుకమ్మలతో ఉద్యమాన్ని నడిపిస్తే… చివరికి ఆ బతుకమ్మను లేకుండా చేయడమేంటన్నారు. తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని సోషల్ మీడియాలోనూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చివరికి విగ్రహావిష్కరణ డేట్ కూడా సోనియా గాంధీ బర్త్ డే రోజు అవుతుండడంపై మరింత ఫైర్అవుతున్నారు.
విపక్షం విమర్శలు ఇలా ఉంటే… కొత్త విగ్రహం రూపకర్తలు స్పందించారు. తెలంగాణ తల్లి చేయి కాంగ్రెస్ చేయి కాదని అది అభయహస్తం అని గంగాధర్, రమణారెడ్డి అంటున్నారు. చేతులున్నవాళ్లంతా కాంగ్రెస్ వాళ్లు, సైకిల్ తొక్కేవాళ్లంతా టీడీపీ వాళ్లా అని ప్రశ్నిస్తున్నారు. బతుకమ్మతో పాటు బోనాలు, సదర్, సమ్మక్కసారలమ్మ జాతర వంటివి తెలంగాణ పండగలేనని… పోరాడి సాధించుకున్న రాష్ట్రానికి.. ఆ పోరాట స్ఫూర్తి ప్రతిబింబించే విగ్రహం ఉండాలన్న రేవంత్ సూచనతో విగ్రహం రూపొందించినట్టు వారు చెబుతున్నారు. తెలంగాణప్రజలు ఈ కొత్త విగ్రహాన్నే ఇష్టపడతారని వారంటున్నారు. అటు ప్రభుత్వం సైతం కొత్త విగ్రహం అద్భుతమంటోంది. సిరుల తెలంగాణకు ప్రతీకగా ఆకుపచ్చ రంగులో సామాన్య మహిళ రూపంలో విగ్రహం ఉండటం సబబేనని రేవంత్ సమర్థకుల వాదన. బీఆర్ఎస్ నాటి విగ్రహంలో ఎక్కడా తెలంగాణ అస్తిత్వం లేదని… గడీల్లో ఉండే దొరసానిలాగా ఉండే విగ్రహం తెలంగాణకు అక్కర్లేదనీ అంటున్నారు.తెలంగాణ అంటే పట్టుచీరలు, మెడలో ఆభరణాలు, వడ్డాణాలు, కిరీటాలు కావని అంటున్నారు.
అసలు నాడూ నేడూ విగ్రహంపై విమర్శలు ఎంతదాకా వచ్చాయంటే బీఆర్ఎస్ తెలంగాణ తల్లి కవితలా ఉందని కాంగ్రెస్ వర్గాలంటే…ఈ విగ్రహం అచ్చం రేవంత్ సతీమణిలా ఉందంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కొత్త విగ్రహాన్ని, గీతారెడ్డి విగ్రహాన్ని పక్కనపక్కన పెట్టి చూడండంటూ ట్రోల్ చేస్తున్నారు.
పార్టీలు, నాయకులు ఇలా విగ్రహ రాజకీయం చేస్తూ దుమ్మెత్తి పోసుకుంటుంటే సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకుని విగ్రహం పేరుతో టైంపాస్ లేంటని మండిపడుతున్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి విగ్రహాలు, చిహ్నాలు, పేర్లు మార్చటమేంటంటున్నారు. ఇగో పాలిటిక్స్ కి కేంద్రంగా తెలంగాణను మారుస్తున్నారని… దేశంలో ఏరాష్ట్రంలోనూ ఇలాంటి రాజకీయం లేదని అంటున్నారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని నినాదాలు, ప్రచారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని…మార్పు తేవడం అంటే చిహ్నాలు, విగ్రహాలు మార్చుకుంటూ వెళ్లడమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో సమస్యలు ఉండగా ప్రయార్టీస్ ఇవా అని నిలదీస్తున్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర గీతాన్ని కొత్తగా రూపొందించింది. అయితే గీతం బాణీపై విమర్శలు వచ్చాయి. ఇక కాకతీయ తోరణాన్ని రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించటానికి ప్రయత్నించి భంగపడింది ప్రభుత్వం. అమరవీరుల స్థూపం విషయంలోనూ విమర్శలు ఎదుర్కొంది. అటు ఈ రెండు పార్టీల వైఖరిపై తీవ్రంగా మండిపడుతోంది మరో విపక్షం భారతీయజనతా పార్టీ. ప్రజా సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోవటం మానేసి కొత్తగా విగ్రహ రాజకీయాలను మొదలుపెట్టాయని కిషన్ రెడ్డి విమర్శిస్తున్నారు. పదేళ్లు ఏలిన బీఆర్ఎస్ చేసిందేం లేదని…కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా తెలంగాణ కోసం చేస్తున్నదేం లేదని ఒక నియంత పోతే మరో నియంత వచ్చాడని ఆ పార్టీ నేతలంటున్నారు. ఏడాది పాలన- వైఫల్యాలపై ఇటీవలే కిషన్ రెడ్డి చార్జిషీట్ రిలీజ్ చేశారు. తెలంగాణ బాగుపడాలంటే అది బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ చెప్పుకుంటోంది.
అటు విగ్రహ మార్పుపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.విగ్రహం మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూలూరి గౌరీ శంకర్ పిల్ వేశారు. విగ్రహ ప్రతిష్ట నిలిపేసేలా ఆదేశాలివ్వాలంటూ ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈనెల 9న సచివాలయం ప్రాంగణంలో విగ్రహావిష్కరణకు ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.