మూసీ నది ప్రక్షాళనను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.అధికారంలోకి వచ్చిననుంచి మూసీ పునరుజ్జీవంపై ఫోకస్ పెట్టింది. దశల వారీగా మూసీ ప్రాజెక్ట్ ను చేపట్టాలని నిర్ణయించింది. మొదటి దశలో బాపూఘాట్ ఎగువ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. మూసీ నదిలో ప్రవేశించే నీటిని శుద్ధి చేసి దిగువకు వదలాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడు వేల కోట్లరూపాయలతో కొత్తగా ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుద్ధి చేసిన నీరు మాత్రమే మూసీలో ప్రవహించేలా ప్రణాళికలు రచిస్తున్న ప్రభుత్వం… ఇందుకోసం ఈ వారంలోనే టెండర్లను పిలవనుంది. సీఎం రేవంత్ వరుసగా అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు.
మూసీ ప్రాజెక్టు తొలి దశలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల నుండి బాపూఘాట్ వరకు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. బాపూఘాట్ ప్రాంగణంలో ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా ఆప్రాంతాన్ని తీర్చిదిద్దాలని…చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలనీ నిర్ణయించారు.
ఇక నీటి శుద్ధి ద్వారా మూసీ ప్రక్షాళన చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఎస్టీపీలను ఏడు వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. శుద్ధి చేసిన నీరే మూసీలో కలిసేలా ఏర్పాట్లు చేయనుంది. ఇందుకు మల్లన్న సాగర్ నుండి ఉస్మాన్ సాగర్‌కు నీటిని తరలించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మూసీ పరిసర ప్రాంతాల శుభ్రత, సుందరీకరణ పనులు వేగంగా జరిగేలా చూడాలని యంత్రాంగాన్ని రేవంత్ ఆదేశించారు. మూసీ నది పునరుద్ధరణతో నగరం సుందరంగా మారడంతో పాటు… నగరంలోని ప్రజలకు పరిశుభ్ర నీటి వనరులు అందించగలమని రేవంత్ సర్కారు భావిస్తోంది.