కాంగ్రెస్ పాలనకు చూస్తుండగానే ఏడాది పూర్తవుతోందని తిరిగి వచ్చేది మళ్లీ తామేనని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తమను అధికారానికి దూరం చేసి వారేం కోల్పోయారో ప్రజలకు అర్ధంఅవుతోందని ఆయన అన్నారు. ఇతర పార్టీలనుంచి పలువురు పార్టీలో చేరిన సందర్భంగా…చాలాకాలం తరువాత ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజలు తెలివిగా ఉన్నారని అన్నీ చూస్తున్నారని …ఎవరూహైరానా పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎన్ నేతలు, శ్రేణులనుద్దేశించి ఆయన అన్నారు. తమ పార్టీపైనే ప్రజలు విశ్వాసంతో ఉన్నారని… తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ సర్కారే ఏర్పడడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ పైనా ఘాటు వ్యాఖ్యలేచేశారు మాజీ సీఎం.పాలన అంటే వట్టి మాటలో, కూలగొట్టడమో కాదన్నారు. సమాజాన్ని నిలబెట్టి నిర్మాణం చేయాలని…ప్రజలు పాలనాబాధ్యతలు అప్పగిస్తే పనిచేయాల్సింది పోయి…పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని…మాటలూ తమకూ వచ్చని ఆయన మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇస్తే సేవచేయకుండా మాటలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే 90 శాతం ఎక్కువే అమలుచేశామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా నెలవేర్చడం లేదని ఆరోపించారు. ప్రజలు అన్నీగమనిస్తున్నారని… అక్రమ కేసులకు భయపడవద్దని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. అందరూ కష్టపడి పని చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ కామైపోయారు.ఫలితాలు వచ్చిన మరునాడే ఇంట్లో కాలుజారి పడిపోయారు. కొంతకాలం ఆస్పత్రిలోనే ఉండి ఆ తరువాత ఎర్రవల్లి ఫాంహౌస్ కి వెళ్లిపోయారు. తరువాత లోక్ సభ ఎన్నికలప్పుడు ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఒక్క ఎంపీ సీటునూ గెలుచుకోలేదు. దీంతో ఆయన పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక రోజుమాత్రం అసెంబ్లీకి వచ్చిన ఆయన… మళ్లీ ఫాంహౌస్ కు వెళ్లిపోయారు. ఇప్పుడు దాదాపు 5 నెలల తరువాత మళ్లీ ఆయన నోరువిప్పారు.వచ్చేది మళ్లీ తమ ప్రభుత్వమేనంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేప్రయత్నం చేశారు.