లోక్ మంథన్ -2024 ఈసారి భాగ్యనగర్లో జరుగుతోంది. మన మూలాలను, మన సంస్కృతిని మరిచిపోతున్న తరణంలో అసలైన భారతీయతను నగరపౌరులకు గుర్తుచేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారత్ నలుమూలలనుంచే కాక..ఈసారి ఇతర దేశాలనుంచీ అతిథులు ఈ సాంస్కృతిక మేళాకు అతిథులుగా రావడం విశేషం. లిథివేనియా,ఆర్మేనియా, బాలి,ఇండోనేషియా, ఇరాన్ తదితర దేశాలనుంచి డెలిగేట్స్ లోక్ మంథన్ కు వచ్చారు. ఇక ఇక్కడికి వచ్చిన వాళ్లలో అందరినీ ఆకర్షిస్తున్నవాళ్లు యెజ్డీస్.
YEZDI తెగది ఇరాన్ లోని సింజార్ ప్రావిన్స్ . హిందు ఆచారసంప్రదాయాన్ని అనుసరిస్తున్న వీళ్లు తమ సంస్కృతిని తెలియచెప్పేందుకు ఇక్కడికి రావడం ఒక ఎత్తైతే..అంతులేని కష్టాన్ని మూటగట్టుకుని జీవిస్తున్న యెజ్డీలు భారత్ తమను కష్టాలనుంచి గట్టెక్కిస్తుందనే ఆశతోఉన్నారు.
పదేళ్లల్లో ఈతెగకు చెందిన వేలాదిమందిని ఐసిస్ ఉగ్రవాదులు చంపేశారు.. వేలాది మహిళల్ని ఎత్తుకుపోయారు.యెజ్డీ ఆడవాళ్లు చాలాఅందంగా ఉంటారు.అందుకే వారిని అపహరించుకెళ్లి వర్కర్స్ గా వాళ్ల బందీలుగా చేసుకుంటున్నారు. దీంతో దశాబ్దాలనుంచీ తమ మాతృదేశాన్ని వీడి వెళ్తున్నారు. ఫలితం సింజార్ లో ఒకప్పుడు 98 శాతంగాఉన్న వాళ్లజనాభా ఇప్పుడు 2శాతానికి పడిపోయింది. 98 శాతం ముస్లింలతో ఇప్పుడాప్రాంతం నిండిపోయింది.
యెజ్డీ నేషనల్ యూనియన్ ప్రతినిధి బృందంగా మన భాగ్యనగరంలో జరుగుతున్న లోక్ మంథన్ కు వాళ్లు వచ్చారు. సనాతన హిందుధర్మాన్నివారు ఆచరిస్తున్నారు. వాళ్ల ఆచార సంప్రదాయాల్నిప్రదర్శించాల్సిందిగా ప్రజ్ఞాప్రవాహ్ ఆహ్వానిస్తే వాళ్లు వచ్చారు. హిందూ ఆచార సంప్రదాయాలువారు పాటిస్తారు. ప్రపంచంలోనే పురాతన తెగ తమది అని వారునమ్ముతారు. పంచభూతాలను వారు ఆరాధిస్తారు. సూర్య భగవానుడిని ప్రార్థిస్తారు. కార్తికేయుడిని కొలుస్తారు. కార్తికేయుడివారసులం తామని గర్వంగా చెప్పుకుంటారు. హిందువుల వలెనే ప్రకృతి ఆరాధకులు, లోకకల్యాణాన్ని కోరుకుంటారు. తమకు దిక్కు మోదీయేనని, భారతే అని వాళ్లునాతో చెప్పారు. ప్రపంచ దేశాల మద్దతు పొందేలా మోదీ తమకు సాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఇంకా ఎన్నివిషయాలు చెప్పారో khdr hajoyan. 2014లో ఉత్తర ఇరాక్ లోని యెజ్డీల ప్రత్యేక నేలను ఐసిస్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. నాటి నుంచి భారత్ మద్దతు కోసం తిరుగుతున్నాడంట. ఇప్పటికి హజోయాన్ భారత్ రావడం ఇది నాలుగోసారి.
పలకరించినంతనే ఎంత ఆనందమోవాళ్ల కళ్లల్లో. భాగ్యనగర్ పర్యటనకు రావడం సంతోషంగాఉందని.. తెలుగు ప్రజలను కలవడం ఆనందంగా ఉందని చెప్పారు. హాజోయాన్ అయితే భారతీయుల చరిత్ర , సంస్కృతిపై పరిశోధన చేస్తున్నాడు. రెండు ప్రాచీన సమాజాల మధ్య సారూప్యతలకుకారణాన్ని ఇప్పటికే కనుగొన్నానని చెపుతున్నారు.
మోదీ అంటే ఎంతో అభిమానం వీళ్లకు. ఆయనజోక్యం చేసుకోవాలని తమ తరపున ఐక్యరాజ్యసమితిలో మాట్లాడాలని కోరుతున్నారు. భారత్ పర్యటనకువచ్చిన ఈ సందర్భంగా నరేంద్రమోదీకి, విదేశాంగమంత్రి జైశంకర్ కు , ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ జీకి లేఖ రాస్తానని చెప్పారు.
అక్కడినుంచి చెదిరిపోయినవారికి ఆర్మేనియా ఆశ్రయం ఇచ్చిందట. అక్కడావాళ్లు తమ సంస్కృతిని ఆచరిస్తున్నారు. కార్తికేయుడికి సొంత ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఈ యెజ్దీలు ఆర్మేనియా తరపున లోక్ మంథన్ కు వచ్చారని చెప్పవచ్చు. గతంలో రష్యా, జార్జియాలోనూ వీరు పర్యటించి మద్దతు కోరారట. వారికి ఆర్ట్ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ సహా హిందూ సంస్థలు సాయం చేశాయంట. 2015లో మొదటిసారి ఢిల్లీవచ్చినప్పుడు భారత్ నుంచే వారికి సహాయ సామాగ్రిని పంపించారట. ఇప్పటికీ ఎంతో సాయం చేసినప్పటికీ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తమ తరపున స్వరంవినిపించాలని మోదీని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
40 ఏళ్ల క్రితం 80 లక్షల జనాభా ఉండేదట వారిది. ఇప్పుడు 25లక్షలకు పడిపోయింది. మరి స్వస్థలం వదిలి వెళ్లిపోయారు కదా… అంతర్జాతీయ స్థాయిలో మద్దతు ఎలా అంటే ఇంకా ఆశ ఉందని చెబుతున్నారు వాళ్లు. మోదీ మీద ఆశ ఉందని, భగవంతుడి మీద నమ్మకం ఉందని ఆ ఆశతోనే బతుకుతున్నామనీ చెప్పారు. యెజ్డీలు మనవాళ్లే. మనవాళ్లకు మంచి జరగాలని మనమూ కోరుకుందాం. అందుకు పూనుకోవాలని భారత ప్రధానికి యెజ్డీల తరపున మనమూ విజ్ఞప్తిచేద్దాం.