తెలంగాణలోని గవర్నమెంట్ స్కూళ్లు, సంక్షేమ హాస్టల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మధ్య అయితే మరణాలు కూడా. నారాయణ పేట జిల్లా మాగనూరులో ఏకంగా 29 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 886 మంది విద్యార్థులు మధ్యాహ్నా భోజనం తిని హాస్పిటల్ పాలయ్యారు. ఇంకా బయటకు రాని ఉదంతాలు ఎన్నో. ఆ లెక్కలెలా ఉన్నాయో. సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ లాంటి కీలక శాఖలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన గురుకులాలనుంచి మొదలుపెడితే పాలమూరులోని జడ్పీ స్కూళ్లవరకు ఇదేపరిస్థితి. గిరిజన పాఠశాలలో విషాహారం తిని ఓ బాలిక చనిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే ఈ ఘటనల వెనక విపక్ష బీఆర్ఎస్ కుట్ర ఉందని అధికార పార్టీ అంటోంది. సంక్షేమ గురుకుల విద్యాలయాల మాజీ కార్యదర్శి, బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందనీ పేరుకూడా ప్రస్తావిస్తున్నారు. సాక్షాత్తూ మంత్రి కొండా సురేఖ ఆర్ ఎస్ పేరును ప్రస్తావించారు. దీంతో ప్రవీణ్ కుమార్ సైతం సీరియస్ అయ్యారు. తాను కుట్ర చేసినట్టు ఆధారాలుంటే బయటపెట్టాలని.. నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధమన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న తప్పు సమస్య మాత్రం అలాగే ఉంటోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్కూళ్లలో పిల్లలకు పెట్టే ఆహారం గురించి పట్టించుకునే పరిస్థితే లేదు.చివరికి హైకోర్టు కలుగచేసుకొని రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాలతో స్పందించిన ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ను నియమించింది. అందులో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జిల్లా స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. ఇలాంటి ఘటనలు జరిగిన చోట కమిషన్ సభ్యులు వెళ్లి నిజానిజాల్ని వెల్లడిస్తారు. ఇప్పుడిప్పుడే మేల్కొన్న ప్రభుత్వం పాఠశాలలు, కళాశాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఈ కమిటీలు స్టోర్ రూమ్, వంట రూమ్ ని రోజు పరిశీలించాలని.. విద్యార్థులకు వడ్డించే ముందే ఫుడ్ టేస్ట్ చేయాలని సూచించింది. ఇంకా ప్రత్యేకంగా ఒక యాప్ ని డెవలప్ చేయబోతున్న ప్రభుత్వం ఆలోగా ఫోటోలు తీసి భద్రపర్చాలని ఆదేశించింది. మండలం, జిల్లా లెవల్ లో అధికారుల్ని పర్యవేక్షకులుగా నియమించాలని కలెక్టర్లకు సూచించింది. వాళ్లు ఆయా విద్యాసంస్థల్ని సందర్శిచాల్సి ఉంటుంది.
అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరుగుతోంది?.ఎలాంటి చర్యలు తీసుకోవాలి?. సెంట్రల్ గవర్నమెంట్ డేటా పరిశీలిస్తే కలుషితాహారం వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య తెలంగాణలో చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏ పాఠశాలల్లోనూ సరైన వసతులు లేకపోవటం దీనికి ముఖ్య కారణం. వంట గదులు లేక ఆరు బయట వండే స్కూళ్లు రాష్ట్రంలో లెక్కలేనన్ని ఉన్నాయి. స్టోర్ రూం లో ఎలుకలు, బొద్దింకలు, ఎలాంటి గాలి ఆడని ప్రదేశాల్లో వంట సామాగ్రి నిల్వ ఉంచటం ముఖ్య కారణాలు. వంటకు వాడుతున్న నీళ్లు నేరుగా బావులు, బోరుల నుంచి తీసుకోవటం కలుషితానికి కారణమవుతున్నాయి. వండే మహిళలకు శుభ్రత, ఆహార నాణ్యత మీద అవగాహన లేకపోవటం వల్లే ఈ పరిస్థితి అని చెప్పవచ్చు. సరిగా క్లీన్ చేయని వంట సామాగ్రి మరో కారణం. వర్షాకాలంలో అయితే మరీ దారణమైన పరిస్థితులు.కాంట్రాక్టర్లు నాణ్యత లేని పప్పుదినుసులు, ఇతర ఆహారపదార్థాలు సరఫరా చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు ఇంకో కారణం. ఇక గురుకులాల్లో అయితే వార్డెన్లు రాత్రుళ్లు హాస్టళ్లలో బస చేయకుండా కేర్ టేకర్లకు వదిలేయటం మరో కారణం. మామూలు పరిస్థితుల్లో అయితే ఎక్కడైనా నాణ్యత లేని ఆహారం కనిపిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ ప్రభుత్వం నిర్వహించే గురుకులాలు, పాఠశాలల్లో మాత్రం ఎవ్వరిమీదా చర్యలేఉండవు. మధ్యాహ్న భోజన పధకానికి ప్రభుత్వం అందిస్తున్న నిధులు ఏ మాత్రం సరిపోవట్లేదు. ప్రస్తుతం ఒక ప్రైమరీ విద్యార్థికి కుకింగ్ కాస్ట్ కి 5 రూపాయల 45 పైసలు, అప్పర్ ప్రైమరీ విద్యార్థికి 8 రూపాయల 17 పైసలు ఇస్తున్నాయి. ఇవి ఏమాత్రం రియలిస్ట్ క్ కాదని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఇక వండుతున్న ఆహారం క్వాలిటి చెక్ చేయటానికి ఎలాంటి వ్యవస్థలు లేవు.
చాలా చోట్ల కలుషిత ఆహార ఘటనల్ని అధికారులు బయటకి రానివ్వట్లేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు కంప్లెంట్స్ ఇవ్వటానికి ఎలాంటి మెకానిజం లేకపోవటం ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు బిల్లులు పాస్ చేయకపోవటం వల్ల కాంట్రాక్టర్లు, వంట మనుషులు ఆహారం నాణ్యత మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. మమూలుగా అయితే విద్యార్థులకు అందించే ఆహారం 65 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. కానీ టెంపరేచర్ చెక్ చేయటానికి కూడా ప్రస్తుతం విద్యాసంస్థల్లో ఎలాంటి ఏర్పాట్లు లేవంటే ఇక నాణ్యత మీద భరోసా ఎక్కడి నుంచి వస్తుంది. ఎలాంటి ఒత్తిడి భయం లేని పరిస్థితుల్లో చదుకోవాల్సిన పిల్లలు.. ప్రతి పూట తమకు ఏం అవుతుందో అన్న ఆందోళనతో చదుకోవాల్సి రావటం దారుణం. ఇఫ్పటికైనా ప్రభుత్వం సరైన సౌకర్యాలు, పర్యవేక్షణతో సమర్థమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.