సీతారామ కల్యాణానికి సర్వం సిద్ధం అయింది. మరికొన్ని గంటల్లో జరిగే వివాహ మహోత్సవానికి నేపాల్ లోని జనకపురి ముస్తాబైంది. భారత్ లో ఏటా రాముడు పుట్టిన చైత్రనవమినాడు సీతారాముల కల్యాణం చేస్తారు. కానీ వారి వివాహం జరిగింది మార్గశిర శుద్ధ పంచమి. అంటే రేపే. ప్రతీఏటా నేపాల్లో వివాహపంచమి పేరుతో వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఐదేళ్లకోసారి ఇంకా పెద్దఎత్తున రంగరంగ వైభవంగా జరుపుతారు. ఈసారి రామకల్యాణానికి 5 లక్షలమంది భక్తులు హాజరవుతారని అంచనా. భారత్ నుంచి కూడా వేలాదిగా జనక్ పురిలో జరిగే జానకిరాముల కల్యాణానికి హాజరుకానున్నారు. 5 వేల మందితో బారాత్ కు ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు.
స్వాతంత్ర్యం రాకముందు అంటే 1947 వరకూ వారి కల్యాణానికి మన అయోధ్య నుంచి బియ్యం-తలంబ్రాలతో,వధూ వరులకు కల్యాణ వస్త్రాలు జనకపురి వెళ్లేవి. ఇక్కడినుంచి ఓ బృందం అధికారిక లాంఛనాలతో వెళ్తే…పెద్దసంఖ్యలో భక్తులూ కాలినడకన వాహనాల్లో వెళ్లి ఆ మహోత్సవాన్ని తిలకించి వచ్చేవాళ్లు. పెళ్లి కొడుకు తరపు, వియ్యాలవారు వచ్చారంటూ నేపాల్ ప్రభుత్వం, ప్రజలు వాళ్లకు సాదరస్వాగతం పలికి సకల మర్యాదలు చేసేవారు. బీహార్-నేపాల్ సరిహద్దుల్లోనే ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, ప్రజలు వచ్చి మనోళ్లను ఘనంగా స్వాగతించి పెళ్లి వస్త్రాలను ఏనుగుపై, అతిధులను గుర్రాలు, రథాలపై తీసుకెళ్లేవారు. ఇక ఈసారి అంటే రేపే. మరికొన్నిగంటల్లోజరిగే వేడుక కోసం జనకపురిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత్ నుంచి వచ్చే అతిథుల కోసం కూడాప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు జనకపురిలోని జానకీ మాత ఆలయ నిర్వాహకులు తెలిపారు. బిహార్లోని కొంత ప్రాంతం నాడు మిథిలాపురి కింద ఉండేది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు సీతామాతను కిషోరీగా తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. దేశమంతటా శ్రీరామ నవమికి సీతాాకల్యాణం జరుపుకుంటే… బిహార్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం వివాహపంచమిని నిర్వహించుకుంటారు.
ఇంకా ప్రతీ ఏటా…ఆనాడు జనకుడు స్త్రీధనం కింద సీతమ్మ తల్లికి ఇచ్చిన నేలలో పండిన ధాన్యం కూడా నేపాల్ ప్రభుత్వం ఊరేగింపుగా అయోధ్యకు పంపేదట. బ్రిటిష్ పాలకులు ఉన్నంతవరకూ కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. అయితే మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొట్టతొలి ప్రధాని ది గ్రేట్ నెహ్రూ గారు ఆనవాయితీని రద్దు చేశారు. మరి మనది సెక్యులర్ కంట్రీకదా. అలాంటి పద్ధతులు పాటిస్తే ఇతరుల మనోభావాలు గాయపడ్తాయి. వాళ్లు పంపే ఐదారు ధాన్యపు బస్తాలకు ఊరేగింపులు, వేడుకల పేరుతో సమయం డబ్బు వృధా ఎందుకు అని ఆపేశారట.
నాటి నుంచి నేపాల్ జనకపురిలో సీతారామకల్యాణానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఎవరూ వెళ్లడం లేదు. కొందరు భక్తులు మాత్రం వెళ్లి వస్తూ ఉంటారు. అయితే చాలా ఏళ్లకు 2019లో వీహెచ్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం జనకపురి వెళ్లింది. త్రేతాయుగంలో రామకల్యాణం జరిగినంత సంబరంగా నాడు నిర్వహించారు. సీతారాములకు తలంబ్రాలు, పసుపు వస్త్రాలు తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి వెళ్లిన విశ్వహిందూపరిషత్ ముఖ్యులను నేపాల్ రాష్ట్రపతి, ప్రధాని సహా స్థానికులు భారత్-నేపాల్ సరిహద్దువరకు వచ్చి మనవాళ్లకు ఘన స్వాగతం పలికారు.
నాటి నుంచి నేపాల్ నుంచి ప్రత్యేక బృందం స్వయంగా వచ్చి అక్కడి వేడుక కోసం ఆహ్వానం పలుకుతోంది. పదిరోజుల క్రితం కూడా జనకపురి ఆలయ అర్చకులు, అధికారులు అయోధ్య వచ్చి ఆలయ కమిటీ ప్రతినిధులు, వీహెచ్పీ ముఖ్యులకు వివాహ పత్రిక అందజేశారు. భారత్ నుంచి ముఖ్యంగా బిహార్ నుంచి పెళ్లికొడుకు తరపున ఇప్పటికే నేపాల్ చేరుకున్నారు. 5 వేల మందితో బారాత్ కు జనక్ పూర్ ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.