బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ కృష్ణదాస్ ప్రభు అరెస్ట్ పై తాజాగా మరో ట్వీట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. చిన్మయ్ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం అన్యాయమైన, నియంతృత్వ, పక్షపాత వైఖరిని ఆయన తప్పుపట్టారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను గతంలోనూ ప్రస్తావిస్తూ, వారికి మద్దతు తెలుపుతూ గతంలోనూ ఆయన స్పందించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ ఆలయాలపై దాడుల గురించి ముందునుంచీ స్వరం పెంచుతున్న రాజకీయనాయకుడు పవన్ కల్యాణ్ ఒక్కరే. ఈసారి మరింత ఘాటుగా ఆయన రియాక్టయ్యారు. చిన్మయి ప్రభు కోసం ప్రపంచం మొత్తం స్పందించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. సోకాల్డ్ సెక్యులరిస్టులు, మానవహక్కుల వాళ్లను, స్వయంప్రకటిత మేధావులను ఏకిపారేశారు. ఇతర సందర్భాల్లో స్వరంపెంచే మీరంతా బంగ్లాదేశ్ లో జరుగుతున్న అమానుషంపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎక్స్ లో సుదీర్ఘంగా రాసుకొచ్చిన ఆయన భారత్, బంగ్లాదేశ్ లోని రెండు కేసులను ప్రస్తావిస్తూ భారతదేశం, ఇక్కడి వ్యవస్థల ఔన్నత్యాన్ని వివరించారు.
ఆయన ప్రస్తావించిన మొదటిది కసబ్ కేసు:
2008నాటి ముంబైపై ఉగ్రవాద దాడిని గుర్తు చేశారు. ఆ ఏడాది నవంబర్ 26న జరిగిన దాడితో యావత్ దేశం వణికిపోయింది. ముంబై మహానగరం నెత్తుటితో తడిచిపోయింది. నాటి దారుణమారణకాండలో …26మంది విదేశీ అతిథులతో పాటు 166మంది బలయ్యారు. వారిలో అమరులైన పోలీసు ఉన్నతాధికారులు, భద్రతాదళాల సిబ్బంది 20మంది. ఆ మారణ హోమానికి తెగబడిన ముష్కరులను భారత బలగాలు మట్టుపెట్టగా అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. దొరికిపోయిన కసబ్ తన నేరాన్ని అంగీకరించాడు. భారత్ మీద యుద్ధం ప్రకటించడం, వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీయడం వంటి 86 నేరారోపణలపై కేసులు నమోదు చేశారు. ఇదంతా చెప్తూ… కరడు గట్టిన ఉగ్రవాది పట్టుబట్టినప్పటికీ భారతదేశ న్యాయస్థానం ఉన్నతంగా వ్యవహరించిదని పవన్ రాసుకొచ్చారు. ఆ కేసులో కసబ్ ను 9 నెలలపాటు విచారించారు. అందులో కసబ్ కు సంపూర్ణ సహకారం ఈ దేశం,ఇక్కడివ్యవస్థలు అందించాయి. నేరాలతో సంబంధం లేకుండా ఆ నరరూప రాక్షసుడికి రక్షణ కల్పించారు. న్యాయవాదినీ ఇచ్చారు. భాషతో ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు. సరైన వైద్యసాయం అందించారు ఎప్పటికప్పుడు. విచారణ జరిగినంత కాలం ఏ ఇబ్బందీ లేకుండా చూసుకున్నారు.
ఫిబ్రవరి 2011లో కసబ్ మరణ శిక్షను బాంబే హైకోర్ట్ సమర్థించింది. దీంతో కసబ్ సుప్రీం కోర్టుకు వెళ్లాడు. చివరిప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునేందుకు భారత వ్యవస్థకు అతనికి అనుమతించాయి. అయితే క్షమాభిక్షకు రాష్ట్రపతి నిరాకరించడంతో కసబ్ ను ఉరితీశారు. నాటి విషయాలను గుర్తు చేస్తూ కరడుగట్టిన నేరస్థుని విషయంలో ఇక్కడి న్యాయవ్యవస్థతో పాటు కార్యనిర్వాహక వ్యవస్థ మానవహక్కుల సూత్రాలకు లోబడి వ్యవహరించాయని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యం గొప్పతనం అదని అన్నారు. దేశంపై యుద్ధానికి వచ్చిన తీవ్రవాదికే హక్కులపరంగా అన్నీ కల్పించిన భారత్…అన్ని ఆధారాలనూ ప్రపంచం ముందు పెట్టిందని పవన్ ట్వీట్లో పేర్కొన్నారు. భారత్ లో ఉన్న హ్యూమన్ రైట్స్, సోషల్ టోలరెన్స్, పారదర్శక విచారణ, స్వేచ్ఛాయుత వాతావరణం, సక్రమమైన న్యాయవిచారణ… ఇక్కడి లౌకికతపై అచంచలమైన నమ్మకానికి నిదర్శనగా నిలిచాయని ఎక్స్ వేదిగ్గా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
పవన్ ప్రస్తావించిన రెండోది చిన్మయ కృష్ణదాస్ కేసు:
రెండు కేసులను ప్రస్తావిస్తూ భారత్, బంగ్లాదేశ్ మధ్య తేడాను వివరించారు.నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నేతృత్వంలో ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందూ మైనారిటీలను అణచివేస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ద్రోహం కేసునమోదు చేసి చిన్మయప్రభును అరెస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఒక నిర్దోషిని అరెస్ట్ చేసి వేధించడం ఏంటని మండిపడ్డారు. చిన్మోయి ప్రభుకు న్యాయసహాయం కూడా చేయవద్దని అక్కడి న్యాయవాదులు మూకుమ్మడిగా తీర్మానించారు. ఆయన తరపున వాదించేవారు కూడా లేరు. నిష్పాక్షిక విచారణ జరిపేపరిస్థితులే అక్కడ లేవు. అంతేకాదు ఇస్కాన్ నే బ్యాన్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు పవన్. ఆ దేశంలో హిందువుల కోసం గొంతెత్తిన చిన్మయిప్రభును అరెస్టు చేసి…న్యాయపరమైన సాయం అందే అవకాశాల్లేకుండా చేస్తున్నారని.. కనీసం విచారణ జరిగే అవకాశమే ఆ దేశంలో లేదని అన్నారు.
చిన్మయిప్రభు విషయంలో ప్రపంచం మొత్తం స్పందించాల్సిన అవసరం ఉంది పవన్ రాసుకొచ్చారు. న్యాయమైన విచారణ అందరి హక్కు అని, కానీ అక్కడి న్యాయవ్యవస్థ తీరు భయం గొలుపుతోందని, కనీస ప్రాథమిక హక్కులు అక్కడ లేవని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ లో ఏం జరుగుతున్నదో చూడాలని హిందువులకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తిచేశారు.సోకాల్డ్ సెక్యులరిస్టులు,స్వయంప్రకటిత మేధావులు,మానవహక్కుల వాళ్లు, ప్రపంచచాంపియన్లమని చెప్పుకునేవాళ్లు ఏమయ్యారని నిలదీశారు. ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే గొంతెత్తే మీ వాయిస్ ఎక్కడని, మీ ఆగ్రహావేశాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
నిరపరాధి అయిన చిన్మయ ప్రభు వంటి వారికోసం అందరూ మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందనీ అన్నారు. సెలక్టివ్ గా ఉండే న్యాయం అన్యాయం అవుతుందని.. ప్రపంచం ఇప్పుడు తన మానవత్వాన్ని చాటుకోవాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.