ఉత్తర, దక్షిణ అంటూ మరోసారి విడదీసే మాటలు మాట్లాడారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి దక్షిణరాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు ఉదారంగా చేయూతనిస్తోందని అన్నారు. ద్రవిడ మోడల్ తో 50 ఏళ్లుగా తమిళనాడు అన్నిరంగాల్లోనూ పురోగతి సాధిస్తోందన్న స్టాలిన్…. పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై అన్న మాటల్ని గుర్తు చేశారు. “వడకు వజ్కిరతు, తేర్కు తీకిరతు (ఉత్తరం జీవంతో నిండి ఉంది, దక్షిణం మసకబారుతోంది)” అని ఆయన అన్నారని…అయితే ఇవాళ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని..తమిళనాడు వెలుగులు చిమ్ముతోందని అన్నారు. అంతేకాదు ఉత్తరాదిని ఉదారంగా ఆదుకుంటోందీ దక్షిణప్రాంతమేనన్నారు.
ఉత్తరాదిరాష్ట్రాల్లో పోలుస్తూ తమిళనాడు అభివృద్ధి గురించి చెప్పిన స్టాలిన్.. తమిళనాడు దేశంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని..ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మార్గం సుగమం చేస్తున్నామని గుర్తు చేశారు. పేదరికాన్ని తగ్గించడం, మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక రంగ పురోభివృద్ధిలో దూసుకెళ్తున్నామని అన్నారు.
అయితే తమిళనాడు పురోగతి గురించి చెప్పడం వరకు సరే కానీ ఉత్తర, దక్షిణ అంటూ విభజించే మాటలేంటని మండిపడుతున్నారు కొందరు. ప్రాంతీయ అభిమానం వరకు కాక…విద్వేషం పెంచే రీతిలో ఆయన మాటలుంటున్నాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.