తన తండ్రి ముఖ్యమంత్రిత్వంలో,కూటమి ప్రభుత్వపాలనలో మహారాష్ట్రలో ఎలాంటిహింసాత్మక ఘటన జరగలేదు. ఎవరిమీదా మూకదాడి జరగలేదు. ఇది శివసేన యువనాయకుడు ఆదిత్యఠాక్రే… సౌరబ్ ద్వివేదికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాట. మాబ్ లించింగే జరగలేదన్నజూనియర్ ఠాక్రే మాటలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. పాల్ఘర్లో సాధువుల హత్యలను ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. కాషాయ దుస్తులు ధరించిన భగవత్ స్వరూపులైన సాధువుల హత్యల్ని బాల్ థాక్రే మనవడు నిజంగానే విస్మరించాడో లేదా కావాలని అంటున్నాడో కానీ… ఆ ఘటనను మహారాష్ట్ర ఎన్నిటికీ మరువబోదనీ అంటున్నారు.
2020 ఏప్రిల్ 16న జునా అఖాఢాకు చెందిన ఇద్దరు సాధువులు మహారాజ్ కల్పవృక్షగిరి, సుశీల్ గిరి మహరాజ్ తో పాటు వారి 30 ఏళ్ల డ్రైవర్ ను కొందరు దండగులు విచక్షణారహితంగా కొట్టిచంపారు. వారు గుజరాత్ నుంచి సూరత్ వెళ్తుండగా మహారాష్ట్ర లోని పాల్ఘర్ జిల్లా గడ్చించల్ లో ఈ ఘటన జరిగింది. పెద్దఎత్తున కర్రలతో వచ్చిన గుంపును అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోలేకపోయారు..సాధువులనుకాపాడే కనీస ప్రయత్నమూ వారు చేయలేదు. .
అసలైతే ముందు పోలీసులు చెప్పిన మాటవేరు. సాధువులను కాపాడేందుకు వచ్చిన తమ ఫోర్స్ పైనా స్థానికులు మూకదాడి చేశారని వారు చెప్పారు. అయితే పోలీసుల వాదనను తోసిపుచ్చే వీడియోలు కాసేపటికే బయటకు వచ్చాయి. పోలీసులే ఆ సాధువులను అక్కడ చేరిన గుంపుకు అప్పగించినట్టు, వారి ముందే ఉన్మాదగుంపు వారిని కొట్టి చంపినట్టు స్పష్టంగా ఉన్న ఆధారాలవి.
సాధువుల హత్య ఆకస్మికం కాదని… సూరత్ వెళ్తూ ఆ పూటకు అక్కడ బస చేసిన సాధువులను పథకం ప్రకారమే చంపారనే అనుమానాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. కమ్యూనిస్టు పార్టీకి చెందిన గ్రామ పంచాయతీ సభ్యుడే కొందరు యువకులను ఉసిగొల్పి కర్రలు, రాళ్లు, ఆయుధాలు ఇచ్చి వాళ్లమీదకు పంపినట్టు స్థానికులు కొందరు తెలిపారు. దారిలో నరికిన చెట్లను,బండరాళ్లను పెట్టిన విషయాన్నీ గుర్తించారు. వీటన్నింటిని బట్టి ఉద్దేశపూర్వకంగా,రాజకీయ ప్రేరేపిత హింసే అయి ఉండవచ్చని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఇక ఆ హింసలో క్రైస్తవ మిషనరీ సంస్థలు, కొందరు స్థానిక NCP నాయకులు, వావపక్ష నాయకుల ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈఘటన దేశవ్యాప్తంగా కలకలంరేపింది.అందరినీ కదిలించింది. దోషులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. జనం నుంచి వచ్చిన ఒత్తిళ్లతో పాల్ఘర్ ఎస్పీ గౌరవ్ సింగ్ ను నిర్బంధ సెలవుపై పంపారు.మరో ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. అంతేకాదు ఆ సాధువులను దగ్గరుండి ఉన్మాదులకు అప్పగించిన స్థానిక కాసా పోలీస్ స్టేషన్ కు చెందిన 35 మంది పోలీసులనూ బదిలీచేశారు. ప్రజలనుంచి మరింత ఒత్తిడి పెరగడంతో ఘటన జరిగిన నాలుగురోజులకు కేసును సీఐడీకి అప్పగించారు.అసలైతే ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి.
నాలుగేళ్లనాడు అంత దారుణం జరిగితే ఆదిత్యఠాక్రే మాత్రం అసలు మహారాష్ట్రలో మూకదాడి ఘటనే జరగలేదంటున్నారు.ఎంత ఘోరం.