ఇవాళ్టి ఎన్నికల ఫలితాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన స్థానం యూపీలోని కుందర్కి నియోజకవర్గం. 60శాతం ముస్లిం జనాభా ఉన్న ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఘనవిజయం సాధించారు. అక్కడినుంచి 12 మంది బరిలో నిలవగా 11 మంది ముస్లింలే కావడం విశేషం. హోరాహోరీ అనుకున్న ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రామ్ వీర్ తొలిరౌండ్ నుంచి ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. లక్షన్నర ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అసలైతే కుందర్కి ముందునుంచీ సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట. సంభల్ లోక్ సభ స్థానం పరిధిలోని ఈ స్థానంలో ముస్లిం జనాభా అధికం. 30 ఏళ్లల్లో ఇక్కడ బీజేపీ గెలిచిందే లేదు. ఇక ఈసారి అభ్యర్థుల్లో రామ్ వీర్ ఒక్కడే హిందువు. ముస్లిం ఓట్లలో చీలిక, హిందూ ఓటర్ల ఐక్యతే బీజేపీ అభ్యర్థి విజయానికి కారణమని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత కూడా ఎస్పీ పరాజయానికి కారణంగా చెబుతున్నారు.
ఇక ఈ ఉపఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదైన సెగ్మెంట్‌గానూ కుందర్కి నిలిచింది. సీఎం యోగీ సైతం ఈ ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఐక్యంగా ముందుకెళదాం, విజయతీరాన్ని చేరుదాం అని మోదీ మహారాష్ట్రలో ప్రచారం చేసినట్టు యోగీ సైతం అందరం కలిసికట్టుగా ముందుకు సాగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామంటూ ప్రజల ముందుకు వెళ్లారు.