తెలంగాణలో ఇకనుంచి బెనిఫిట్ షోలు ఉండవని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. చనిపోయిన రేవతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తానని అల్లు అర్జున్ ప్రకటించాడు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ లో జరిగిన విషాదం గురించి అందరికీ తెలిసిందే. ఆ రోజు అల్లు అర్జున్, దేవీశ్రీ ప్రసాద్ సడెన్ గా థియేటర్ కి వచ్చారు. అప్పటికే ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్… భారీగా గూమికూడారు. థియేటర్ లోపల బయట ఇసుక వేస్తే రాలనంత జనం. గేటు తెరవగానే జనం ఒక్కసారిగా లోపలకు దూసుకెళ్లారు. తోపులాటలో కొందరు కిందపడిపోయారు. అక్కడున్న పోలీసులు కొందరికి సీపీఆర్ సహా ఇతర సపర్యలు చేయటం మొదలుపెట్టారు. ఆ తొక్కిసలాటలోనే రేవతి, ఆమెతో పాటే ఉన్న కొడుకు పడిపోయారు. రేవతి అక్కడే ప్రాణాలు వదలగా..అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన ఆమె కుమారుడు శ్రీతేజను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఏమాత్రం ప్రణాళిక లేకపోవడం వల్లే ఫ్యాన్స్ ప్రాణాలమీదకు వచ్చిందని విమర్శలు వచ్చాయి. ప్రివ్యూ గురించి, అల్లుఅర్జున్ రాక గురించి…సినిమా టీం నుంచి కానీ, థియేటర్ యాజమాన్యం నుంచి కానీ పోలీసులకు సమాచారం లేదు. అంతపెద్ద స్టార్ వస్తున్నాడంటే క్రౌడ్ ఉంటుంది. కానీ కంట్రోల్ చేయడానికి ధియేటర్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అల్లు అర్జున్ లోపలకు వెళ్లి రావడానికి సెపరేట్ ఎంట్రీ, ఎగ్జిట్ లేవు. ఆయన లోపలకు వెళ్లగానే అందర్నీ అదే ద్వారం నుంచి వదిలారు. దీంతో హీరోను చూడాలంటే ఆరాటం, సీట్లు దొరకబుచ్చుకోవాలనే తొందరతో అందరూ ఒకేసారి దూసుకెళ్లారు. థియేటర్ కెపాసిటిని మించి జనం అందులోకి చేరారు. ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ సెక్యూరిటీ స్టాఫ్ జనాన్ని ఇష్టం వచ్చినట్టు తోసినట్టు చెబుతున్నారు. అంతే తోపులాట,తొక్కిసలాట. కొందరికి శ్వాస అందలేదు. మరికొందరు ప్యానిక్ అయ్యారు. కిందపడిన రేవతి అక్కడే ప్రాణాలు వదిలింది.
అయితే ఇందులో థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ ది తప్పు ఉంది. ఎంతో క్రేజ్ తో రీలీజై… ఎప్పుడు కిటకిటలాడే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు రావలనుకోవటం ఆయన చేసిన తప్పు. ఒక వేళ రావాలనకున్న ఎలాంటి సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. ప్రత్యేకంగా రావటానికి… పోవటానికి చర్యలు తీసుకోలేదు. కనీసం అక్కడున్న జనాల్ని అంచనా వేసి ముందుకు వెళ్లాల్సింది.
తెలుగువాళ్లకు సినిమా పిచ్చి కాస్త ఎక్కువే. గతంలోనూ సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసలాటలు జరిగిన సంఘటనలున్నై. ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నై. 2003 లో రాజమండ్రి ఉర్వశి థియేటర్ లో చిరంజీవి ఠాగూర్ సినిమా రిలీజైన రోజు…టికెట్ కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఇద్దరు చనిపోయారు.2012 లో బిల్లా మూవీ రీలీజ్ అప్పుడు ఒకరు చనిపోయారు. 2017లో గోవిందుడు అందరివాడే సినిమా ప్రదర్శిస్తున్న కర్నూల్ థియేటర్ లో రామ్ చరణ్ ఫ్యాన్ ఒకరు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ మధ్య పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా రీలీజ్ అప్పుడు వైజాగ్ లో ఫ్యాన్స్ తోపులాటలో అద్దాలు ధ్వంసమయ్యాయి. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ హనుమకొండలో జరిగినప్పుడు కూడా ఫ్యాన్స్ తోసుకొని కొంత మందికి గాయాలయ్యాయి. మహేశ్ బాబు గుంటురూ కారం ప్రీ రీలిజ్ ఈవెంట్ లో పోలీసులకు గాయాలయ్యాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచే ఈ ఫ్యాన్స్ అతి చేష్టలున్నాయి. ఫాన్స్ అనే పేరుతో సినిమా రీలీజైన మొదటి రోజే చూసేయాలన్న ఆత్రం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పెద్ద సినిమాలు, క్రేజ్ ఉన్న నటుల సినిమాలు రీలీజైనప్పుడు యువతరం ఎగబడిపోతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా టికెట్ ధరలు పట్టించుకోకుండా వేలం వెర్రిగా ప్రవర్తిస్తున్నారు. ఆర్మీలు, టీం లు, అసోసియేషన్ ల పేరుతో ఈ పిచ్చి కొనసాగుతోంది. కొన్నిసార్లు వారిస్తున్నా వినిపించుకోకుండా ప్రవర్తించే వాళ్ల వల్ల నటులకు చెడ్డ పేరు వస్తోంది. సినిమా కంటే ప్రాణం ఎంతో విలువైందన్న విషయాన్ని మరిచిపోతున్నారు. మొన్న జరిగిన ఘటనలో తల్లీ చనిపోవడం, కొడుకు ప్రాణాలతో పోరాడుతుండడం కలిచివేసింది. చనిపోయిన రేవతి కుటుంబం మొత్తం ఆ రోజు థియేటర్ కు వచ్చింది. యువత సరే..మహిళలు కూడా ఎగబడడం ఏంటి? అదీ అంత చిన్న పిల్లలను తీసుకురావల్సిన అవసరం ఏంటి? మొదటి రోజు మొదటి ఆటను అంత చిన్న పిల్లలకు చూపించాలా? చివరకు ఏమైంది?
యువతరం సినిమాని ఒక వినోద సాధనంగా చూడటం నేర్చుకోవాలి. కానీ ఫ్యానిజం పేరుతో ఎగబడుతున్నారు. వంద రూపాయల టికెట్ ను ఐదు పదింతలు పెట్టి కొంటున్నారు. స్వయంగా అల్లు అర్జునే డబ్బు విలువ గురించి చెప్తూ… ఏ వస్తువు ఎంత ధరో అంతే పే చేస్తాను తప్ప రూపాయిఎక్కువ ఖర్చు పెట్టను అన్నాడు. ఆ హీరోను అభిమానించే వాళ్లు అతని మాటలను మాత్రం ఎందుకు ఎక్కించుకోవడం లేదు.అల్లు అర్జున్ అన్న ఆ మాటలు ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్లలో, ఆడియో ఫంక్షన్లలో తొక్కిసలాటలు రిపీట్ అవుతూనే ఉన్నా…అటు ఇండస్ట్రీ జాగ్రత్త పడడం లేదు. ఇటు ప్రభుత్వాలూ చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం థియేటర్లలో క్రౌడ్ మేనేజ్ మెంట్ పై విధివిధానాల్ని ప్రకటించాలి. కెపాసిటిని మించి అనుమతించకుండా నియంత్రించగలగాలి. థియేటర్లలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ లు… గుర్తించే విధంగా సెపరేట్ గా ఉండాలి. డోర్లు చిన్నగా కాకుండా విశాలంగా ఉండాలి. ఇలాంటి ఈవెంట్ లకు ఎంత మంది వస్తారు… ఎలా వస్తారో ముందే ప్లాన్ చేయగలగాలి. క్రౌడ్ మేనేజ్ మెంట్ లో ట్రైన్ డ్ సిబ్బందిని నియమించుకోవాలి. స్థానిక పోలీసులు, ఇతర సంస్థలతో మూవీ టీం సంప్రదింపులు జరిపాకే ఈవెంట్లను నిర్వహించాలి. కేవలం బెనిఫిట్ షోలను బ్యాన్ చేయటం వల్ల సమస్య పరిష్కారం అవదు. ఎందుకంటే బెనిఫిట్ షో కాకపోతే ఆ సినిమా రీలీజైన మొదటి రోజు ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంపై ఇండస్ట్రీ, ప్రభుత్వం ఆలోచించాలి.