రాహుల్ గాంధీ అతి తెలివి తేటలతో డాక్టర్ అంబేద్కర్ పేరు వివాదంలోకి లాగి బిజెపి కి పెద్ద ఆయుధం ఇచ్చి తాను ఇరుకునపడి,పార్టీని ఇరుకున పెట్టారు.అంబేద్కర్ కి నెహ్రూ కి, పొసగలేదు అనే సంగతి చరిత్ర చదివిన వారి అందరికి తెలుసు. నెహ్రూ గురించి అంబేద్కర్, అలాగే అంబేద్కర్ గురించి నెహ్రూ అప్పటి రాజకీయాలకు అనుగుణంగా పరస్పర ఘాటు విమర్శలు చేసుకున్నారు.
ఏది ఏమైనా, కాంగ్రెస్ పార్టీకి పెద్ద నేతలు అయిన నెహ్రూ మరియు ఇందిరా ఉన్నన్నాళ్లు అంబేద్కర్ ని కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ పెద్ద నాయకులు పోయిన తరువాత అయినా అంబేద్కర్ పేరు ఓట్ల కోసం ఉపయోగించుకున్నారు తప్పఆయనకు దళితులలోఉన్న పాపులారిటీకి తగ్గ ప్రాముఖ్యత ఆయనకు ఇవ్వలేదు.
అందుకే కాంగ్రెస్ కి అంబేద్కర్ అంటే ఎంత గౌరవమో ఈ క్రింద విషయాలు చూస్తే మనకు అర్ధం అవుతుంది.
1. అంబేద్కర్ కి పార్లమెంటు లో ప్రవేశం లేకుండా చేయడానికి 1952 మరియు 1954 ఎన్నికల్లో అంబేద్కర్ ని ఓడించడానికి కాంగ్రెసు చేయని ప్రయత్నం లేదు. రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయన్ను ఓడించింది. అంబేద్కర్ కి వ్యతిరేకంగా నెహ్రూ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.
2. తప్పనిసరి అయి అంబేద్కర్ కి నెహ్రు కేబినెట్ లో లా మంత్రి గా ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చినా అన్ని పెద్ద చదువులు చదివిన అంబేద్కర్ కి ఏ ముఖ్య కేబినెట్ కమిటీల లోనూ స్థానం ఇవ్వలేదు. అంబేద్కర్ అటువంటి కేబినెట్ లో ఇమడలేక అవమానం ఫీల్ అయి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇలా రాజీనామా చేస్తున్నారు అనే సంగతి నెహ్రూ కి ముందుగా తెలియచేసినా, అయన రాజీనామా ఆపకపోగా, ఆయన కేబినెట్ నుండి బయటకు పోతే నష్టమేమీ లేదు అని కూడా అన్నారు.
3. స్వాతంత్రం వచ్చిన 4 దశాబ్దాల వరకు రాజ్యాంగ నిర్మాత అని రోజూ జపించే కాంగ్రెస్ కనీసం అంబేద్కర్ ఫోటో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో పెట్టలేదు. VP సింగ్ ప్రధాని గా ఉండగా పెట్టారు.
4. నెహ్రు, ఇందిరా, రాజీవ్ లకు ఇచ్చుకున్న భారత రత్న బిరుదు అంబేద్కర్ కి ఇవ్వాలి అని కాంగ్రెస్ ఎప్పుడూ అనుకోలేదు. అంబేద్కర్ కి ఏ పద్మ అవార్డ్ ఇవ్వక ముందే 1952 మొదటి ఎన్నికల్లో అంబేద్కర్ ని ఓడించిన కజ్రోల్కర్ అనే మాజీ ఎంపీకి దేశ అత్యున్నత మూడవ అవార్డ్ అయిన ‘పద్మభూషణ్’ అవార్డ్ కాంగ్రెస్ ఇచ్చి గౌరవించింది.
5. నెహ్రూ, ఇందిరా, సంజయ్, రాజీవ్ గాంధీలకు ఢిల్లీ లో ఎకరాలు కొద్దీ స్థలాలలో స్మారక చిహ్నాలు నిర్మించారు కానీ అంబేద్కర్ కి నిర్మించలేదు. అంతేకాకుండా, జూన్ 18, 1959న నెహ్రూ ఒక మేయర్ కి రాసిన ఉత్తరంలో అంబేద్కర్ కి స్మారకం నిర్మించాలి అని వస్తున్న పలు డిమాండ్స్ కి వ్యతిరేకత తెలిపారు.
6. అంబేద్కర్ 1956లో చనిపోయినా కూడా నెహ్రూ బ్రతికి ఉన్నన్నాళ్లూ కనీసం అంబేద్కర్ పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేయలేదు. 1966లో అంబేద్కర్ 75సం. ల జన్మదినోత్సవం సందర్భంగా ఒక పోస్టల్ స్టాంప్ విడుదల అయింది. ఆ స్టాంప్ తో విడుదల చేసిన బ్రోచర్ లో ఇలా రాశారు
“హరిజనులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నించడం లోనూ మరియు భారతదేశం వలసరాజ్యం నుండి రిపబ్లిక్‌గా మారడం”లోనూ అతని పాత్ర ఉంది అని రాస్తూ “తరచుగా సామాజిక మరియు రాజకీయ విషయాలపై తీవ్రమైన పొజిషన్స్” తీసుకునే నాయకుడిగా ఆ బ్రోచర్ వర్ణించింది.
7. కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ అంటే ఎంత చులకనో తెలిపే మరొక సంఘటన చూడండి.
అంబేద్కర్ ని ఘోరాతిఘోరంగా అవమానిస్తూ.. నత్తపై కూర్చున్న అంబేద్కర్ ని, నెహ్రూ కొరడాతో చితకబాదుతున్న కార్టూన్ ని 2006 ఎన్‌సిఈఆర్‌టి పదకొండో తరగతి పుస్తకంలో ప్రచురింపజేసింది కాంగ్రెస్. అంటే రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ నత్త నడక సాగిస్తోంటే, నెహ్రూ కొరడాతో కొట్టి వేగం పెంచినట్లు ఆ కార్టూన్ లో చూపించారు. ఈ కార్టూన్ ని నెహ్రూ మిత్రుడు మరియు కార్టూనిస్ట్ ఐన శంకర్ 1948 లో గీశాడు. ఈ కార్టూన్ ని ఎన్‌సిఈఆర్‌టి పాఠ్య పుస్తకంలో చేర్చడంపై, 2012 లో పార్లమెంటులో పెద్ద గలభా జరగడంతో అప్పటి మానవవనరుల మంత్రి కపిల్ సిబ్బల్ క్షమాపణలు చెప్పాడు. అంటే 2006 నుండి 2012 వరకు ఎన్‌సిఈఆర్‌టి పుస్తకంలో అంబేద్కర్ ని నెహ్రూ కొరడాతో చితకబాదుతూనే ఉన్నాడు. పార్లమెంటులో కపిల్ సిబ్బల్ మాట్లాడుతూ, ఎన్‌సిఈఆర్‌టి పుస్తకాల్లోని పాఠ్యాంశాలు ఎంపిక చేసే కమిటీలో ఉన్నోళ్ల పేర్లు బయటపెట్టాడు. వారిలో ఒకడు ఎవరో తెలుసా పత్రికల్లోనూ, టీవీల్లో రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి మరియూ దళితులు అభ్యున్నతి గురించి సుద్దులు వల్లించే మరియు రాహుల్‌గాంధీతో కలిసి భారత్‌జోడో యాత్రలో పాల్గొన్న యోగేంద్ర యాదవ్.
8. సోనియా కుటుంబ స్నేహితుడు, రాహుల్ గాంధీ విదేశీ గురువు, ఓవర్ సీస్ కాంగ్రెస్ అద్యక్షుడు అయిన సామ్ పిట్రోడా గత సం. ఒక ట్వీట్ పెడుతూ రాజ్యాంగ తయారీలో నెహ్రు పాత్రే ఎక్కువ, కానీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అనే తప్పుడు ప్రచారం బాగా జరిగింది అని రాసాడు.
ఇంతలా అంబేద్కర్ ని అవమానించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, హోమ్ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ని అవమానించారని మాట్లాడటం పెద్ద వింత కాదా?
…..చాడా శాస్త్రి…