తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. ఓ వైపు ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకుంటుంటే…ఏడాది పాలన అట్టర్ ఫ్లాప్ అని విపక్ష బీజేపీ, బీఆర్ఎస్ లు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నాయి. రుణ మాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని… రైతులకు, కౌలు రైతులకు 15 వేల రూపాయల భరోసా ఇంకా అందలేదని, రైతు కూలీలు 12 వేల కోసం ఎదురు చూస్తున్నారని, వరికి బోనస్ ఇవ్వలేదని విమర్శిస్తున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆందోళనతో అసంతృప్తితో ఉన్నారని అంటున్నాయి. ప్రభుత్వం మాత్రం కేసీఆర్ పదేళ్ల పాలన కంటే ఈ ఒక్క ఏడాదిలోనే రికార్డు నియామకాలు చేశామని, అభివృద్ధిని పట్టాలెక్కించామని చెప్తోంది. ఇంతకీ ఈ ఏడాది పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత వరకు ప్రగతి సాధించింది, సంక్షేమ పథకాలు సామాన్యుడి వరకు చేరుతున్నాయా?. ప్రతిపక్షాల విమర్శల్లో నిజం ఎంత?
తెలంగాణ కాంగ్రెస్ 36 అంశాలతో మేనిఫోస్టోను రీలీజ్ చేసింది. అందులో మొదటిది గుడ్ గవర్నెన్స్. ఐతే ఇప్పటి వరకు సమాచార కమిషనర్ ను ప్రభుత్వం నియమించలేదు. కొన్ని వేల అప్పీళ్లు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాల్ని ప్రతి జిల్లాలోనూ నిర్మిస్తామన్న కాంగ్రెస్ ఆ మాటను మర్చిపోయింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకులకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 50 శాతాన్ని కేటాయిస్తామని చెప్పి… ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కనీసం వ్యవసాయ శాఖ పేరును రైతు సంక్షేమ శాఖగా మారుస్తామన్న హామీని నెరవేర్చలేకపోయింది. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ హామీలుఅలాగే ఉన్నాయి. విద్య కు 20 శాతం కేటాయిస్తామని చెప్పి కేవలం 8.6 శాతం మాత్రమే బడ్జెట్ లో కేటాయించింది. మహిళలకు మహాలక్ష్మీ పథకం ద్వారా 2,500 చొప్పున ఆర్థిక సాయం ఇంకా మొదలు కాలేదు. 4వేల రూపాయల పెన్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు.కార్పొరేట్ ఎడ్యుకేషన్ సెక్టార్ ని నియంత్రిస్తామన్న సర్కారుకు ఆ ఊసే లేదు.
ప్రతి మండలంలో 30 బెడ్ ల దవాఖానాల నిర్మాణం అన్నారు. ఎలాంటి పురోగతి లేదు. అసలు ఆరోగ్య రంగానికి కేటాయించింది బడ్జెట్ లో కేవలం 4.6 శాతం మాత్రమే. సొంత భూమిలో ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల సహాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటికి ఈ పథకాన్ని ఆచరణలోకి తీసుకురాలేదు. ఇందిరమ్మ సిమెంట్ సప్లై స్కీమ్ కింద సబ్సీడీ సిమెంట్ అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసెత్తట్లేదు. స్వయం సహాయక సంఘాలకు లక్ష రూపాయల గ్రాంట్, పది లక్షల రుణం లాంటి హామీల్ని చూసి ఓట్లేసిన మహిళలకు ఈ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తోంది. తమ ప్రభుత్వం వస్తే గల్ఫ్ దేశాల్లో పనిచేసే వారి కోసం వంద రోజుల్లో ఎన్ ఆర్ ఐ పాలసీ తీసుకువస్తామని 500 కోట్లతో వలస నిధి ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అతీగతీ లేదు. బడికి వెళ్లే పిల్లలకు 500 వరకు స్కాలర్ షిప్ ఇస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ అసలు ఆ పార్టీ నేతలకు, ప్రభుత్వ పెద్దలకు గుర్తుకు తెచ్చేదెవరు.
హైదరాబాద్ మురికివాడల్లో ఉంటున్న వారికి ఆరోగ్య కార్డులు, ఇళ్లు, గుంతలు లేని రోడ్లు ఆశించిన నగరప్రజలు వాటిపై ఆశలు వదులుకుంటున్నారు. పోలీసులకు వారంలో ఒకరోజు వీక్ ఆఫ్, ఫ్రెండ్లీ పోలీసింగ్, హోంగార్డుల జీతం పెంపు, ప్రమోషన్లు, నయీం కేసు పునర్విచారణ అటకెక్కాయి. ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ కాలేజీ, రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి మచ్చుకైనా కానరావటం లేదు. వరంగల్, ఆదిలాబాద్, నల్గొండలో రవీంద్ర భారతి తరహా సాంస్కృతిక కేంద్రాల్ని నిర్మించటంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సాంస్కృతి రథసారధులకు గౌరవ వేతనం పెంపుపై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కేసులు, విపక్ష నేతలపై దాడులు చేయటంలో గత ప్రభుత్వంలాగే రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. ధరణి పేరుతో గత ప్రభుత్వం చేసిన ఆకృత్యాలకు, రైతులు ఇబ్బందులు గురైన పరిస్థితులు ఇంకా మారకపోవటం ఆయా వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది.
ఇక ఈ ఏడాదిలో చేసిన పనులనూ ఓసారి చూస్తే..ప్రతిపక్షాలు రుణ మాఫీపై విమర్శలు చేస్తున్నప్పటికి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 2 లక్షల లోపు రైతు రుణాల్ని వంద శాతం మాఫి చేసింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాలతో చాలా మంది సంతృప్తితో ఉన్నారు. చిరుద్యోగులు, ఇంట్లో మగవాళ్లపై ఆధారపడే వాళ్లు స్వతంత్రంగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలపై కనీసం 500 రూపాయల వరకు ఆదా అవుతున్నాయి. మార్కెట్లో అన్ని ధరలు పెరిగినప్పటికి విద్యుత్ చార్జీలు, మహిళలకు ఉచిత ప్రయాణం లాంటివి పేదలు, మధ్యతరగతి మహిళలకు కొంచెం ఊరటనందిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటైనా పది నెలల్లోనే 53 వేల పైచిలుకు ఉద్యోగాల్ని భర్తీ చేసింది ఈ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన పదేళ్లలో 7 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం ఏడాదిలోనే 11 వేల టీచర్ ఉద్యోగాల్నిచ్చింది. రికార్డ్ స్పీడ్ తోటి పరీక్షల్ని నిర్వహించి రీజల్ట్ కూడా అందించటం ఈ ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు. పదమూడేళ్ల తర్వాత గ్రూప్-1 మెయిన్స్ ని నిర్వహించటం ఈ ప్రభుత్వం చేసిన గొప్ప పని. ఇంకా గ్రూప్, 2గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీ పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇక హైదరాబాద్ మెట్రో విషయంలోనూ ప్రభుత్వం స్పీడ్ గా వ్యవహరిస్తోంది. ఐదు కారిడార్లలో 74 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించిన ప్రభుత్వం పనుల్ని శరవేగంగా కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతోంది. వచ్చే నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని కృత నిశ్చయంతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మిశ్రమంగా కొనసాగుతుందనే చెప్పవచ్చు. ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నప్పటికి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే నినాదాలతో ముందుకు కొనసాగుతోంది. వచ్చే నాలుగేళ్లలో అయినా రాష్ట్రంపై చెరగని ముద్రవేసే అవకాశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. మూసీ ప్రక్షాళని తలకెత్తుకున్న రేవంత్ రెడ్డి ఎట్లాగైనా సబర్మతీ రివర్ ఫ్రంట్ తరహాలో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. మూసీని మంచి నీటి నదిగా కాకపోయినా కనీసం ముక్కు మూసుకోకుండా ఆస్వాదించినా ఆయన విజయం సాధించినట్టే.