పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను అమలు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం 56మందికి భారత పౌరసత్వం ఇచ్చింది. వారంతా రెండు దశాబ్దాల కంటె ముందు భారతదేశానికి శరణార్థులుగా వచ్చి గుజరాత్లో నివసిస్తున్న హిందువులు. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వారికి పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేసారు. ఎన్నో యేళ్ళుగా పౌరసత్వ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న ఆ శరణార్థులకు ఈ చర్య ఊరట కలిగించింది.
భారత పౌరసత్వం అందుకున్న 56మంది వ్యక్తుల్లో హిషా కుమారిది ప్రత్యేకమైన పరిస్థితి. హిషా 1998లో పాకిస్తాన్లో పుట్టింది. హిందువులపై హింసాకాండ, ఊచకోతను తప్పించుకునేందుకు ఆమె కుటుంబం 2013లో భారత్ వచ్చింది.ఇక్కడకు వచ్చాక 9వ తరగతి నుంచీ తన చదువు మళ్ళీ మొదలుపెట్టింది.
2017లో అజ్మేర్లో వైద్యకళాశాలలో అడ్మిషన్ సాధించింది. ఈ మధ్యనే ఆమె తన వైద్యవిద్య పూర్తిచేసింది. సర్టిఫికెట్ అందుకుంటూ తీవ్ర ఉద్వేగానికి గురైందామె. ‘‘నా అస్తిత్వాన్ని పునరుద్ధరించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు జీవితాంతం ఋణపడి ఉంటాను. ఇప్పుడు ఈ దేశ పౌరురాలిగా నేను ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు’’ అంటూ గర్వంగా తన భారతీయ పౌరసత్వ పట్టాను ప్రదర్శించింది. సీఏఏ కింద భారత పౌరులుగా నమోదు చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేశారు. గతంలో ఢిల్లీ వెళ్లాల్సి వచ్చేది. చాలాసంక్లిష్టం అయ్యేది. అయితే ఇప్పుడు ఇలాంటి అంశాలను ఎక్కడిక్కడే స్థానికంగా పూర్తి చేసేలా సులభతరం చేశారు. 2017 నుంచి మార్చి 2024 మధ్య 1167మంది పాకిస్తానీయులు భారత పౌరసత్వం స్వీకరించారు. ఈ 56మందితో కలిపి ఆసంఖ్య 1222 కు చేరింది.