భాగ్యనగరానికి 80 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ పట్టణానికి సమీపాన దట్టమైన కొండలు,అడవుల మద్య అనంతగిరి గుట్టపైన వెలిసిన వైష్ణవక్షేత్రం అనంత పద్మనాభస్వామి దేవాలయం.
ఆలయం 600 ఏళ్లనాటిదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆలయ ప్రాశస్తిపై పురాణగాథ కూడా ఉంది. ముచుకుందుడు అనే రాజర్షి రాక్షసులతో యుద్దం చేసి అలసట తీరడానికి భూలోకంలో ఏదైనామంచి ప్రదేశం చూపించమని ఇంద్రుణ్నికోరాడట. అంతేకాదు తనకు నిద్రాభంగం కలిగించినవారు తన తీక్షణమైన చూపుతోనే భస్మమైపోవాలని వరం అడిగాడట. తరువాత ఇంద్రుని సూచన మేరకు అనంతగిరికి వచ్చి ఇక్కడే కొండమీద గుహలో నిద్రపోయాడట. ద్వాపరయుగం లో కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారకనగారాన్ని ముట్టడించి యాదవ సైన్యాన్ని నాశనం చేశాడు. శ్రీ కృష్ణ బలరాములు ఇద్దరు కాలయవనుడికి భయపడినట్లు నటిస్తూ ముచుకుందుడు సేదతీరుతున్న అనంతగిరి క్షేత్రానికి పరుగున వచ్చారట. కృష్ణ భగవానుడు తన పైన ఉన్న వస్త్రం తీసి నిద్రిస్తున్నముచుకుందుడిపై వేస్తాడట.అక్కడనిద్రిస్తున్న ముచుకుందుడే కృష్ణుడు అనుకున్న కాలయవనుడిని లేపబోయాడంట. దీంతో ఆగ్రహించిన ముచుకుందుడు తీక్షణ చూపుతో అతన్ని భస్మం చేశాడంట. అప్పుడు శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు ప్రత్యక్షంకాగా ముచుకుందుడు ఆనందంతో వారిపాదాలు కడిగి జన్మ ధన్యం చేసుకున్నాడని విష్ణు పురాణంలో ఉంది., శ్రీ కృష్ణని పాదాలు కడిగిన జలమే జివనది అయినదని అదే కలియుగం లో ముచుకుందా నది ( తరువాత మూసీగా ప్రసిద్ధి చెందినది). కలియుగ ప్రారంభంలో మహా విష్ణువు మార్కండేయ మహామునికి దర్శనం ఇచ్చి అతని తప:ఫలముగా సాలగ్రామ రూపం లో అనంత పద్మనాభుడిగా అక్కడ అవతరించాడని భక్తుల విశ్వాసం.
అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రక్కనే భవనాశనిగా అని పిలిచే భాగీరథ గుండం ఉంది. దాంట్లో స్నానమాచారిస్తే…ఆయురారోగ్యాలు, సకల సంపదలూ కలుగుతాయని భక్తుల నమ్మకం. దేవాలయ పరిసర ప్రాంతంలో 100 వరకు గుహలు ఉన్నాయి .పూర్వము ఋషులు ఇక్కడ తపస్సు చేసుకున్నారనడానికి ఇవి నేటికీ ఆధారభూతంగా ఉన్నాయి.
భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా అనంతపద్మనాభస్వామి విరాజిల్లుతున్నాడు. ఏటా స్వామికి రంగరంగవైభవంగా జాతర నిర్వహిస్తారు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమిన పెద్దజాతరను 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిన మూడు రోజుల పాటు చిన్నజాతర నిర్వహిస్తారు. వికారాబాద్ జిల్లానుంచే కాక మహబూబ్‌గర్,హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, జిల్లా వాసులతో పాటు సరిహద్దు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.
వెళ్లేమార్గం:హైదరాబాద్ -తాండూర్ మార్గంలో వికారాబాద్ దాటగానే అనంతగిరి వస్తుంది. రోడ్డురవాణా సంస్థ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలూ అందుబాటులో ఉంటాయి.